ఓటుకు 18.. పెళ్లికి 21 నా? హైద‌రాబాద్ ఎంపీ.. సూటి ప్ర‌శ్న‌

Update: 2021-12-18 08:54 GMT
హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ.. ప్ర‌ధాన‌మంత్రి మోడీపై నిప్పులు చెరిగారు. అమ్మాయిల కనీస వివాహ వయసు 18 నుంచి 21కి పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్రం అనుమతించడాన్ని తప్పుపట్టారు.

18 ఏళ్ల యువతికి ప్రధానిని ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు వివాహం చేసుకునే హక్కు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. మహిళల స్వేచ్ఛను మోడీ ప్రభుత్వం కట్టడిచేస్తోందనడానికి ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు.

"దేశంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టడానికి కారణం విద్య, ఆర్థిక అభివృద్ధి. చట్టాలు కావు. 18 ఏళ్లులోపే వివాహం అవుతున్న వారి సంఖ్య 1.2 కోట్లు అని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏం చేయలేదు.

2005లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు 26 శాతం ఉండగా.. 2020 నాటికి అది 16 శాతానికి చేరుకుంది. అని నిప్పులు చెరిగారు. అదేస‌మ‌యంలో అసెంబ్లీలో పోటీచేసేందుకు యువకులకు ఉండాల్సిన కనీస అర్హతను కూడా 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు చేయాలని ఓవైసీ డిమాండ్ చేశారు.

ప్రస్తుతం దేశంలో అబ్బాయిల కనీస వివాహ వయసు 21ఏళ్లు, అమ్మాయిల కనీస వివాహ వయసు 18ఏళ్లుగా ఉంది. అయితే, గత కొంతకాలంగా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.

అమ్మాయిల కనీస వివాహ వయసు తక్కువగా ఉండటం.. వారి కెరీర్‌కు అవరోధంగా మారుతోందనే వాదనలు ఉన్నాయి. అంతేగాక, దీని వల్ల చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నా యి. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయసు కూడా 21ఏళ్లకు పెంచాలని పలువురు కోరారు.

కానీ, ఓవైసీ మాత్రం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇది స‌రికాద‌ని మోడీని కోరారు. పెంచినా.. త‌గ్గించినా.. అంతా స‌మానంగా ఉండాల‌ని.. మిమ్మ‌ల్ని ఎన్నుకునేందుకు 18 ఏళ్లు.. వారి జీవితాల‌ను తీర్చిదిద్దుకునేందుకు 21 ఏళ్లు నిర్ణ‌యించే అధికారం మీకు ఎవ‌రిచ్చారు? అని మండిప‌డ్డారు. మ‌రి దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News