ఒవైసీకి సైన్యం అదిరిపోయే రిటార్ట్!

Update: 2018-02-15 12:11 GMT

సంజువాన్‌ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవానులపై ఎంఐఎం నాయకుడు - హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఉగ్ర‌వాదుల దాడిలో మ‌ర‌ణించిన ఏడుగురు సైనికుల్లో ఐదుగురు క‌శ్మీరీ ముస్లింలు ఉన్నారని - ముస్లింల జాతీయ‌త‌ను ప్ర‌శ్నించేవారంద‌రికీ ఇది క‌నువిప్పు కావాల‌ని వ్యాఖ్యానించారు. ఓవైపు దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగాలు చేస్తున్నా పాకిస్థానీయులని ముద్ర వేస్తున్నార‌ని, విధేయతను రుజువు చేసుకోవాలని అంటున్నార‌ని అసదుద్దీన్‌ అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. ఒవైసీ ఇటువంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. తాజాగా, ఒవైసీ వ్యాఖ్యలపై భారత సైన్యం స్పందించింది. త‌మ‌కు సైనికులంద‌రూ స‌మాన‌మేన‌ని - ఏ ఒక్క సైనికుడిని కుల‌ - మత దృష్టితో చూడలేదని స్ప‌ష్టం చేసింది.

మీడియాతో సైన్య ఉత్తర విభాగం లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవరాజ్‌ అన్భు మాట్లాడిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డం - జాతీయ‌త‌కు భంగం క‌లిగించ‌డం వంటి ప‌నులు ఒవైసీ వంటి వారు చేస్తున్నారని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. తాము సైన్యంలో `సర్వ ధర్మ స్థల్‌` అనే సూత్రాన్ని ఆచ‌రిస్తామ‌ని - కొంద‌రు వ్య‌క్తులు అమర వీరులకు కూడా మత రంగును అద్ది లబ్ధి పొందాలని చూస్తున్నార‌ని ఒవైసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సైనికులకు మతం ఉండదనే విషయం వారికి తెలీదేమోన‌ని ఎద్దేవా చేశారు. అటువంటి వ్య‌క్తుల దేశభక్తిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామ‌ని అన్నారు.


Tags:    

Similar News