సైతాన్ అంటూనే అరెస్ట్ మీద అసద్ మాట ఇది

Update: 2016-07-02 05:05 GMT
ఇస్లాం శాంతిని కోరుకుంటుందని.. రక్తపాతం.. విధ్వంసాలు ఇస్లాం అభిమతం కాదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు. శుక్రవారం మక్కా మసీదులో వేలాదిమందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఐఎస్ గుండాల దళమని.. వారు మసీదుల మీద దాడి చేసి ఎందరో ముస్లింలను హతమార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముస్లింలు దేశాన్ని ప్రేమిస్తారే కానీ వదిలి వెళ్లరని.. ఉగ్రవాదం వైపు వెళ్తున్నవారు ముస్లింలు కాదన్నారు. దేశం కోసం తన తల త్యాగం చేసేందుకు సిద్ధమన్న ఆయన.. దేశంలోని గంగా జమునా తహజిబ్ కంటే ఏది గొప్పది కాదన్నారు.

ఇన్ని మాటలు చెప్పిన అసద్.. ఇటీవల ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయంటూ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న యువకులు నిరాపరాధులని తేలితే సమాధానం ఏమిటని ప్రశ్నించటం గమనార్హం. గతంలో మక్కా మసీదు.. మలేగావ్ ఘటనల్లో అమాయకుల్ని అరెస్ట్ చేశారని.. ఇప్పటి అరెస్ట్ లపై నిజానిజాలు కోర్టుల్లో రుజువవుతాయన్నారు. ఎన్ ఐఏ రిపోర్ట్ తాను చూశానని.. అల్లర్లు సృష్టించాలన్న అభియోగం లేదని.. ఇదంతా మీడియా సృష్టిగా చెప్పారు.

ప్రస్తుతం అరెస్ట్ అయిన పాతబస్తీ యువకుల న్యాయపోరాటానికి తాము సహకరిస్తామని.. ముస్లింలపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ హక్కుల కోసం పోరాడుతామన్నారు. ముస్లింల పరిరక్షణ కోసం పోరాడుతున్న తమపై ఆర్ ఎస్ఎస్.. సంఘ్ పరివార్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ముస్లింలపై ఉగ్రవాద ముద్ర వేయొద్దన్న అసద్ మాటల్ని జాగ్రత్తగా చదివితే చాలానే అర్థమవుతుంది. అందుకే.. ఆణిముత్యాల్లాంటి ఆయన మాటల్ని ఒకటికి రెండుసార్లు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పుదు.
Tags:    

Similar News