ఓవైసీకి ప్ర‌భుత్వం అంటే న‌చ్చ‌ట్లేద‌ట‌

Update: 2016-07-13 10:57 GMT
ఆల్ ఇండియా మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు - హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మ‌రోమారు కాశ్మీర్‌ పై స్పందించారు. ఈ ద‌ఫా ఆయ‌న తీవ్ర‌వాదం - ముస్లింల గురించి కాకుండా భార‌త‌దేశ ప‌రిపాల‌న గురించి మాట్లాడారు. అయితే మొత్తంగా ఓవైసీ తేల్చింది ఏంటంటే...ప‌రిపాల‌న లోప‌మే కాశ్మీర్‌ కు శాప‌మంట‌. అంతే కాదు ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తు ఎందుకు పెరుగుతుందో ఆలోచించుకోవాల‌ని ఓవైసీ ఓ స‌ల‌హా ప‌డేశారు.

తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓవైసీ మాట్లాడుతూ కాశ్మీర్‌ సమస్యకు ప్రధాన కారణం ప్రజలను పరాయివారిగా పరిగణించడమేనన్నారు. అంతేకాకుండా సరైన పరిపాలన లేకపోవడమే ఇబ్బంది అని సెల‌విచ్చారు. జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తి మ‌హ్మ‌ద్ స‌యిద్‌ మరణం తరువాత కొన్ని వేలమంది మాత్రమే ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారని - అదే రోజు జరిగిన ఒక ఉగ్రవాది అంత్యక్రియలకు 40 వేలమందికి పైగా ప్రజలు హాజరయ్యారని ఓవైసీ చెప్పారు. దీనికి అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు లేకపోవడమే కారణమనేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్పారు.  మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మరణం తరువాత అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొన్ని నెలల సమయం పట్టిన విషయాన్ని ఓవైసీ గుర్తు చేశారు. ఆ రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉండి - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఎందుకంత ఆలస్యం చేసిందని ఆయన ప్రశ్నించారు.

ఓవైసీ వ్యాఖ్య‌లు ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నికైన కాశ్మీర్ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌ట్టేలా ఉన్న‌య‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం పీడీపీ పార్టీ బీజేపీతో జ‌ట్టు క‌ట్ట‌డం స‌రికాద‌ని ఆయ‌న అన‌డంలేద‌ని గ‌తంలో ఉన్న ఒమ‌ర్ అబ్దుల్లా స‌ర్కారును సైతం ఆయ‌న వైఫ‌ల్యంగా చూపించ‌డం అంటే... జ‌మ్మూలో ప్ర‌జాస్వామ్య పాల‌న‌పై ఓవైసీకి స‌దాభిప్రాయం లేన‌ట్లుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News