జగన్‌ సీఎం కాబోతున్నాడు..: అసదుద్దీన్

Update: 2019-04-05 11:09 GMT
తెలంగాణలో కేవలం ఎంపీ ఎన్నికలు మాత్రమే కావడంతో ఏపీతో పోలిస్తే కాసింత తక్కువగా ఎన్నికల ప్రచారం  సాగుతోంది. గత డిసెంబర్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేసి ఇప్పుడు పార్లమెంట్‌ స్థానాల్లో 16 సీట్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్‌ రోజుకో నియోజకవర్గంలో పర్యటిస్తూ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. అయితే టీఆర్‌ ఎస్‌ కు మద్దతుగా ఉన్న ఎంఐఎం హైదరాబాద్‌ స్థానంలో పోటీ చేస్తోంది. ఇక్కడ టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి బరిలో లేడు. దీంతో   ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ప్రచారం ఏకపక్షంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా అసదుద్దీన్ వికారాబాద్‌ లో నిర్వహించిన సభలో టీఆర్‌ ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న రంజిత్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం విశేషంగా మారింది.. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో ముస్లింలు చాలా ప్రశాంతంగా ఉన్నారన్నారు. అందుకే కేసీఆర్‌ కు తాము మద్దతిస్తున్నామన్నారు. ఏపీలో వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి మంచిపని చేశారన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే జగన్‌ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండేదన్నారు. త్వరలో జగన్‌ సీఎం కావడం ఖాయమన్నారు. ఇక తాను చచ్చేంత వరకు కేసీఆర్‌ తోనే ఉంటామని - ఆయనను వీడేది లేదన్నారు.

కేంద్రంలో బీజేపీ ఉన్నంత వరకు ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఆయన కుల - మతాలను విడదీసి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ - బీజేపీ కాకుండా ఫెఢరల్‌ ప్రభుత్వం రాబోతుందన్నారు. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి విశ్వేశ్వర్‌ రెడ్డి మత్స్యకారులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ఇలా తన మద్దతు తెలంగాణలో కేసీఆర్ కు - ఏపీలో జగన్ కు అని ఓవైసీ కుండబద్దలు కొట్టారు.
   

Tags:    

Similar News