రూ.3 వేల టికెట్ రూ.18వేలు.. మహాకుంభ మేళా ఎఫెక్టు
గత ఏడాది భోపాల్ నుంచి ప్రయాగ్ రాజ్ కు విమాన టికెట్ ధర రూ.2977కాగా ఇప్పుడు రూ.17,796కు చేరుకుంది.
మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే విమాన సర్వీసుల టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్ రాజ్ కు చేరుకోవటానికి భారీ ఎత్తున బుకింగ్ లు చోటు చేసుకోవటంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ విమాన టికెట్ ధరలు ఏకంగా 21 శాతానికి పెరగ్గా.. బోఫాల్ నుంచి ప్రయాగ్ రాజ్ విమాన టికెట్ ధరలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 498 శాతం పెరగటం గమనార్హం.
గత ఏడాది భోపాల్ నుంచి ప్రయాగ్ రాజ్ కు విమాన టికెట్ ధర రూ.2977కాగా ఇప్పుడు రూ.17,796కు చేరుకుంది. ఇదే విషయాన్ని పలు ప్రయాణ పోర్టళ్లు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ జరగనున్న నేపథ్యంలో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగిగపోయాయి. ఈ పరిస్థితి దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాగ్ రాజ్ కు చేరుకునే అన్ని విమాన సర్వీసుల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.
ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ కు 21 శాతం టికెట్ల ధర పెరగటంతో రూ.5748గా చేరుకుంది. పవిత్ర స్నానాలు ఉండే రోజుల్లో ఈ ధరలు మూడు రెట్ల వరకు పెరగటం గమనార్హం. ముంబయి నుంచి ప్రయాగరాజ్ కు 13 శాతం టికెట్ల ధరలు పెరగ్గా.. బెంళూరు నుంచి ప్రయాగ్ రాజ్ కు 89 శాతం పెరిగి టికెట్ ధర రూ.11,158కు చేరుకుంది. అహ్మదాబాద్ - ప్రయాగ్ రాజ్ టికెట్ ధర 41 శాతం పెరిగి రూ.10,364కు చేరుకుంది. ప్రయాగ్ రాజ్ కు పక్కనే ఉండే లక్నో.. వారణాసి నగరాలకు విమాన టికెట్ ధరలు 3-21 శాతం వరకు పెరగటం గమనార్హం.
గత మహా కుంభమేళా సమయంలో ప్రయాగ్ రాజ్ కు నేరుగా ఢిల్లీ నుంచి మాత్రమే విమాన సర్వీసు ఉండేది. కానీ.. ఇప్పుడు 20 నగరాలకు పైనే ప్రయాగ్ రాజ్ కు నేరుగా.. వన్ స్టాప్ విమానాలు నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి అలహాబాద్ కు మామూలు రోజుల్లో విమాన టికెట్ ధర రూ.7వేల వరకు ఉంటే.. ఇప్పుడు అది కాస్తా రూ.10 వేల నుంచి రూ.22 వేల వరకు చేరుకోవటం గమనార్హం. ఎంత డిమాండ్ అయితే మాత్రం మరీ ఇంతలా ధరల దోపిడీ జరుగుతున్న వేళ పౌర విమానయాన శాఖ ఏం చేస్తోంది. ఒక అధ్యాత్మిక కార్యక్రమాన్ని డబ్బుల్ని ఇంతలా పెంచేస్తునన వైనంపై నియంత్రణ విధిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.