ఏపీ పాలిటిక్స్: వీరు వారయ్యారు.. వారు వీరయ్యారు

Update: 2020-02-20 08:45 GMT
రాజకీయమంటేనే అనూహ్యం. ఈ రోజు ఇలా ఉన్నది రేపు వేరేలా ఉంటుంది. రోజుకో మలుపు తిరిగితేనే రాజకీయాలు రసకందాయంగా ఉంటాయి. వాటినే రాజకీయం అనేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ స్వరూపం మారుతోంది. మిత్రులు శత్రులవుతున్నారు.. శత్రువులు మిత్రులవుతున్నారు. ఇన్నాళ్లు ఒకరిపై ఒకరు విమర్శించుకున్న వారు ఇప్పుడు కలిసి నడుస్తున్నారు. ఎటు తిరిగిన రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు, నాయకులు వెంపర్లలాడుతుంటారు. 2019కి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అధికార పార్టీలు, మిత్రపక్షాలు మారాయి.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ను ఓడించి, వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని గెలిపించాలని కోరిన ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలుగుదేశం పార్టీతో తిరుగుతున్నారు.. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా మంగళవారం విజయవాడలో నిర్వహించిన సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను ఆహ్వానించి వారి పక్కన అసదుద్దీన్ కూర్చున్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ పై కేశినేని ప్రశంసలు కురిపించి బీజేపీ తీరును ఎండగట్టారు. అయితే పార్లమెంట్ లో సీఏఏకు మద్దతుగా ఓటేసిన టీడీపీని అసదుద్దీన్ ఎలా పిలిచాడో తెలియడం లేదు. ఇక పార్లమెంట్ లో మద్దతు తెలిపి రాష్ట్రం లో సీఏఏకు వ్యతిరేకం గా జరిగిన కార్యక్రమం లో టీడీపీ నాయకులు పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యం లో ముంచింది.

జగన్ ప్రభుత్వం కూడా తెలంగాణ మాదిరి సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తో పాటు టీడీపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. దానికి టీడీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతారని ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో టీడీపీపై విమర్శలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు టీడీపీ చెంతకు చేరారు. ముస్లింలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అప్పుడు బహిరంగంగా పిలుపునిచ్చిన వ్యక్తి ఇప్పుడు టీడీపీ పక్కన చేరారు.
ఇది ఒక మార్పు అయితే.. మరోటి చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచి బీజేపీతో జగన్ అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబును విమర్శించారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దగా దూషించలేదు. కొంత మెతక వైఖరితోనే వ్యవహరించారు. ఎన్నికల సమయంలో కూడా అంతే. ప్రధాన టార్గెట్ చంద్రబాబు అంతే. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రధాన టార్గెట్ చంద్రబాబు ఉండగా ఆయన దూరం చేసుకున్న బీజేపీకి జగన్ దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. వీటిని ఇటీవల ఢిల్లీలో వైఎస్ జగన్ పర్యటన చూస్తే అది వాస్తవమేనని అనిపిస్తోంది. అందుకే సీఏఏ, ఎన్నార్సీ తదితర అంశాలపై అధికార పార్టీ పెద్దగా స్పందించడం లేదు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిశారు. దీంతో కేంద్రంలో వైఎస్సార్సీపీ చేరబోతోందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాలు చివరకు ఎక్కడకు దారి తీస్తాయో చూడాలి. చంద్రబాబు, అసదుద్దీన్ మిత్రులయితే.. జగన్, నరేంద్రమోదీ దోస్త్ లయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబుకు శత్రువు ఎవరైతే వారిని జగన్ మిత్రులు చేసుకుంటారు. గతంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఆ విధంగానే జరిగితే త్వరలోనే కేంద్రంలో వైఎస్సార్సీపీ భాగస్వామి అయ్యేట్టు కనిపిస్తోంది.




Tags:    

Similar News