అసద్ మాట విన్నారా?

Update: 2016-03-29 06:13 GMT
భారత్ మాతాకీ జై అనే మాట నా నోటి నుంచి రాదంటే రాదంటూ మాట్లాడిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎట్టకేలకు తన మాటను కాస్త మార్చి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తాజాగా ఆయన పార్టీకి చెందిన నేతలు పలువురు.. హైదరాబాద్ మహానగరంలోని పలు కూడళ్లలో పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసి.. ‘ఐ లవ్ మై ఇండియా’’ అంటూ నినాదాలు అందులో అచ్చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హైదరాబాద్ మహానగరిలోని పలుచోట్ల భారీ కటౌట్లతో దేశంపై తనకున్న ప్రేమను చాటి చెప్పుకునే ప్రయత్నం చేసిన మజ్లిస్ అధినేత.. తాజాగా తన యూపీ పర్యటనలో ఇదే తరహా నినాదాన్ని చేయటం ఆసక్తికరంగా మారింది. యూపీ రాజధాని లక్నోలో మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని.. ‘‘జై మీమ్.. జై భీమ్’’ అన్న నినాదంతో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇంతకీ జై మీమ్ అంటే.. జై ముస్లిం అని.. జై భీమ్ అంటే దళితులకు సంకేతంగా ఆయన అభివర్ణించారు.

తమ పార్టీ కేవలం ముస్లింలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించేది కాదని.. దళితుల సంక్షేమం కోసం పోరాడుతుందని చెప్పుకొచ్చారు. తమది భారతీయుల పార్టీగా అభివర్ణించటం గమనార్హం. తాను విధేయత కలిగిన భారతీయ పౌరుడినని చెప్పిన అసద్.. జై హింద్.. జై భారత్ అని నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై అనని అసద్.. . జై భారత్ అని మాత్రం అన్నారు. 
Tags:    

Similar News