ఎట్టకేలకు మోడీ సర్కారు తగ్గింది.. ఆశీష్ మిశ్రాను అరెస్టు చేశారు

Update: 2021-10-10 06:01 GMT
'కండ కావరం' అనే మాట.. ఆ కేంద్రమంత్రి కొడుకు చేసిన నిర్వాకానికి చాలా చిన్న మాట. చేతిలో పవర్ ఉంది.. తామేం చేసినా పట్టించుకోకుండా.. చూసిచూడనట్లుగా వ్యవహరించే మోడీ సర్కారు ఉన్న వేళ.. తమ ప్రత్యర్థుల విషయంలో ఒక కసాయితనంతో వ్యవహరించినా ఫర్లేదన్న రీతిలో.. తన ఖరీదైన వాహనాన్ని ఆందోళన చేస్తున్న రైతుల మీద పోనిచ్చి.. పలువురు ప్రాణాలు పోవటానికి కారణమైన బీజేపీ నేత పుత్రరత్నాన్ని అరెస్టు చేయటానికి దాదాపు రెండు వారాల సమయం పట్టింది.

నీతులు.. ఉపదేశాలు.. అంతకు మించిన మానవత్వపు మాటలు.. వ్యక్తిత్వ వికాస బోధనలు చేసే నేత ప్రధానిగా ఉన్న దేశంలో.. తన కేబినెట్ లోని మంత్రిగారి అబ్బాయి చేసిన దారుణ చేష్ట మీద.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవటానికి ఇంత సమయం గతంలో ఎప్పుడూ జరగలేదేమో? వ్యవస్థలు ఎంతలా భ్రష్ఠుపట్టాయన్న దానికి నిదర్శనంగా  లఖిమ్ పూర్ ఖేరి ఉదంతం నిలిచిందని చెప్పాలి.

ఈ దారుణంలో కీలక భూమిక పోషించి.. రికార్డుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఆశీష్ మిశ్రాను ఎట్టకేలకు అరెస్టు చేసినట్లుగా ప్రకటించారు యూపీ పోలీసులు. ఇతగాడి చేష్టలపై విరుచుకుపడిన దేశ ప్రజలు వెంటనే అతడ్ని అరెస్టు చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చినా.. యూపీసర్కారుకు.. అక్కడి పోలీసులకు వినిపించలేదు. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసిన తర్వాత కానీ తెలివిలోకి రాలేదు. అప్పుడు హడావుడిగా అతడ్ని అదుపులోకి తీసుకున్న యూపీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. దాదాపు పన్నెండు గంటల పాటు విచారణ జరిపి చివరకు అతన్ని అరెస్టు చేశామన్న సాహస నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా సదరు కేంద్రమంత్రిగారి పుత్రరత్నం విచారణకు సహకరించటం లేదన్న విషయాన్ని డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ వెల్లడించటం గమనార్హం. కొన్నిప్రశ్నలకు సమధానం చెప్పలేదని.. అతన్ని కోర్టులో ప్రవేశ పెడుతున్నట్లుగా వెల్లడించారు. అంతమంది ప్రాణాల్ని తీసి దర్జాగా ఉండిపోయిన అతడ్ని అదుపులోకి తీసుకోవటానికి నానా చావు చావాల్సి వచ్చంది.అలాంటిది.. సదరు ముదురుకేసునుపోలీసులు అదుపులోకి తీసుకున్నంతనే.. అతడి నోటి వెంట నిజాలు వచ్చేస్తే.. ఇంకేమైనా ఉంటుందా? విచారణలో సరిగా సమాధానాలు చెప్పని ఇతడి తీరుకు కోర్టు ఏ తీరులో స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News