విమానమెక్కేవాళ్ల‌కు రాజు గారి ముఖ్య గ‌మ‌నిక!

Update: 2017-12-14 06:47 GMT
ఇటీవలి కాలంలో గ‌గ‌న విహారంలో ఎదుర‌వుతున్న వేధింపులు, ఇబ్బందులు బాగానే పెరిగిపోయాయి. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది పాల్ప‌డుతున్న దురుసు చేష్ట‌లు, ప్ర‌యాణికుల‌పై జ‌రుగుతున్న అకృత్యాలు ఇప్పుడు బాగానే ఎలివేట్ అవుతున్నాయి. అదే స‌మ‌యంలో విధి నిర్వ‌హ‌ణ‌లో నిబంధ‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తున్న విమాన‌యాన సిబ్బందిపై మ‌న పేరు గొప్ప నేత‌లు ఇష్టారాజ్యంగా దాడుల‌కు దిగేస్తున్నారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పెను క‌ల‌క‌ల‌మే రేపాయి. మ‌రాఠా ఎంపీ గైక్వాడ్ తో పాటు మ‌న‌ తెలుగు నేతాశ్రీ‌, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి దాష్టీకం పుణ్య‌మా అని ఇప్పుడు కొత్తగా గ‌గ‌న విహారానికి అన‌ర్హులంటూ కొత్త జాబితాలు వ‌చ్చేశాయి. ఇక మొన్న‌టికి మొన్న మ‌న స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధూ - దంగ‌ల్ గ‌ర్ల్ జైరా వాసీంల‌కు ఎద‌రైన చేదు అనుభ‌వాలు కూడా మ‌నం మ‌రిచిపోలేనివే. అయితే గ‌గ‌న విహారంలో ఈ మాత్రం ఘ‌ట‌న‌లే ఎందుకు వెలుగులోకి వ‌చ్చాయి? ఇంకా వేరే ఘ‌ట‌న‌లు ఏమీ లేవా? ఉంటే.. అవెందుకు బ‌య‌ట‌కు రాలేదు? అయినా గ‌గ‌న విహారంలో వేధింపులు ఎదురైనా, స‌మ‌స్య‌లు స్వాగ‌తం చెప్పినా... మ‌నం ఏం చేయాలి? అందుకు విరుద్ధంగా మ‌న వీఐపీలు ఏం చేస్తున్నారు? అన్న విష‌యాల‌పై మ‌న తెలుగు నేత‌, కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న మిస్ట‌ర్ క్లీన్ పొలిటీషియ‌న్ పూస‌పాటి అశోక గ‌జ‌ప‌తి రాజు చాలా క్లియ‌ర్ క‌ట్‌గా స్పందించారు.

కాసేప‌టి క్రితం విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌ కు వ‌చ్చిన ఆయ‌న‌ను టీవీ9 ప్ర‌తినిధి అలా ప‌ల‌క‌రించారో, లేదో... ఈ త‌ర‌హా ఇబ్బందుల‌పై ఆయ‌న ఫుల్ క్లారిటీతో ఇచ్చిన స్టేట్ మెంట్‌ను మ‌న‌మంతా... ముఖ్యంగా ఆకాశ‌యానంలో త‌ర‌చూ విహ‌రిస్తున్న సంప‌న్న వ‌ర్గం మాత్రం వినాల్సిందే. ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్ర‌త్యేకించి ప్రైవేట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన సిబ్బంది ప్ర‌యాణికుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, దానిపై ప్ర‌భుత్వం ఏ రీతిన స్పందిస్తుంది అన్న విష‌యాల‌ను రాజు గారు క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గానే చెప్పేశారు. అంతేకాకుండా ప్ర‌యాణికులు ఏం చేయాల‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌యాణికులు... చేయాల్సిన ప‌నిని మానేసి... అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌న్న కోణంలో మాట్లాడిన రాజు గారి స్టేట్ మెంట్ నిజంగానే ఆస‌క్తి రేకెత్తించేదే. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... విమాన‌యానంలో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ప్ర‌స్తావించిన స‌ద‌రు ఛానెల్ ప్ర‌తినిధి... ఆ ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌భుత్వం ఏం చ‌ర్యలు తీసుకొంది? అని ప్ర‌శ్నించారు. దీనికి చాలా వేగంగానే కాకుండా కాస్తంత నింపాదిగా, ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైపోయిన రాజు గారు... చాంతాడంత చెప్పినా... అస‌లు సిస‌లు విష‌యాన్ని చెప్పారు.

విమాన‌యానంలో ఎవైనా సమస్య‌లు ఎదురైతే... వాటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావాల‌ని ఆయ‌న సూచించారు. ఇందుకు త‌మ మంత్రిత్వ శాఖ ఏడాదిన్న‌ర క్రిత‌మే *ఎయిర్ సేవా* పేరిట ఓ ప్ర‌త్యేక యాప్‌ ను విడుద‌ల చేసింద‌ని చెప్పారు. దేశీయంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న అన్ని ప్ర‌భుత్వ‌ - ప్రైవేట్ ఎయిర్ లైన్స్‌ కు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకే ఈ యాప్‌ను విడుద‌ల చేశామ‌న్నారు. అంతేకాకుండా ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా ప్ర‌భుత్వం దృష్టికి రావ‌డ‌మే ఈ యాప్ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. చాలా చిన్న విష‌యాల‌ను కూడా ఈ యాప్ ద్వారా త‌మ‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని, అయితే అందుకు విరుద్ధంగా ప్ర‌యాణికులు ఈ యాప్‌నే ఆద‌రించ‌లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏటా 10 కోట్ల మంది ఆకాశ‌యానం చేస్తుంటే... ఇప్ప‌టిదాకా ఈ యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకున్న వారి సంఖ్య 10 వేలు కూడా దాట‌లేద‌ని చెప్పారు. అయినా ఓ వ్య‌వ‌స్థ అన్నాక‌... స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయ‌ని, వాటిని ప‌రిష్క‌రించేందుకే తాము ఉన్నామ‌ని, అలాంట‌ప్పుడు స‌మ‌స్య‌ను త‌మ‌కు చెప్ప‌కుండా... ప‌బ్లిసిటీ కోసం మీడియాకు ఎక్క‌డం ఏమిటో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని కూడా ఆయ‌న ఎదురు ప్ర‌శ్న‌లు సంధించారు. సెల‌బ్రిటీలు మాత్ర‌మే మీడియాకు ఎక్కుతున్న వైనాన్ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ను యాప్ ద్వారా త‌మ‌కు తెలిపితే... దానిని ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా కొన్ని ఘ‌ట‌న‌లు మీ దృష్టికి వ‌చ్చాయి క‌దా? అన్న మీడియా ప్ర‌తినిది ప్ర‌శ్న‌కు కాస్తంత ఘాటుగా స్పందించిన మంత్రి... ప్లెయిన్‌ లో స‌ర్వ్ చేసిన టీ, కాఫీ చ‌ల్ల‌గా ఉన్నాయ‌ని త‌న‌కు ఫిర్యాదు చేస్తే... తాను ఆ టీని వేడి చేసి ఇవ్వ‌లేను క‌దా అని కూడా కాస్తంత ఘాటుగానే స‌మాధానం ఇచ్చారు. వ్య‌వ‌స్థ అన్నాక‌... స‌మ‌స్య‌లు వాటి ప‌రిష్కారం కూడా ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం జ‌రుగుతాయ‌న్న విష‌యాన్ని మ‌రువ‌రాద‌ని ఆయ‌న చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్ సేవా యాప్‌ ను ప్ర‌యాణికులంద‌రినీ చేరేలా ప్ర‌చారం చేశామ‌ని, అయితే దానికి ప్ర‌యాణికుల నుంచి ఆశించినంత స్పంద‌న రాలేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ కార‌ణంగానే చిన్న స‌మ‌స్య‌లు కూడా పెద్ద‌వి అయిపోతున్నార‌ని - ప్ర‌భుత్వ స‌ల‌హాలు - సూచ‌న‌ల‌ను పాటిస్తే... ఈ ఇబ్బందులు పున‌రావృతం కావ‌ని కూడా రాజు గారు త‌న‌దైన స్టైల్లో చెప్పేశారు. మొత్తానికి రాజు గారు చెప్పిన విష‌యాల‌ను మాత్రం ఇక‌నైనా ప్ర‌యాణికులు పాటిస్తే... మున్ముందు స‌మ‌స్య‌లు రాకుండా మ‌రింత బెట‌ర్ జ‌ర్నీ సాధ్య‌మ‌ని మాత్రం చెప్ప‌క తప్ప‌దు.

అంత‌కుముందు ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏకంగా గంట‌న్న‌ర ఆల‌స్యంగా బ‌య‌లుదేర‌డంతో అప్ప‌టికే విమానం ఎక్కిన ప్ర‌యాణికులంతా... అదే విమానంలో ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజును చుట్టుముట్టి ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించార‌ట‌. దీంతో అక్క‌డిక‌క్క‌డే స్పందించిన గ‌జ‌ప‌తిరాజు... ఎయిర్ ఇండియా చీఫ్ ప్ర‌దీప్ ఖ‌రోలాకు ఫోన్ చేసి... విమానం ఆల‌స్యంపై ఆరా తీయ‌క త‌ప్ప‌లేద‌ట‌. మంత్రి ఫోన్‌ తో వెంట‌నే ఎయిర్ ఇండియా అధికారులు వెంట‌నే రంగంలోకి దిగ‌గా... మంచు కార‌ణంతో పాటు చెకింగ్ కార‌ణంగా పైల‌ట్ పావు గంట ఆల‌స్యంగా రావ‌డంతో విమానం ఏకంగా గంట‌న్న‌ర ఆల‌స్యంగా బ‌య‌లుదేరింద‌ట‌. అంటే నేటి ఉద‌యం 6 గంట‌ల‌కు ఢిల్లీలో బ‌య‌లుదేరాల్సిన విమానం 7.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి... విజ‌య‌వాడ‌కు గంట‌న్న‌ర ఆల‌స్యంగా చేరుకుంది. అయితే విమానం ఆల‌స్య‌మ‌వుతున్న విష‌యాన్ని సిబ్బంది ప్ర‌యాణికుల‌కు చ‌ర‌వేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఈ కార‌ణంగా మంత్రికి ప్ర‌యాణికుల నుంచి నిర‌స‌న తప్ప‌లేదు. ఈ మొత్తం ఎపిసోడ్‌ పై ప్రాథ‌మిక ద‌ర్యాప్తు చేప‌ట్టిన అధికారులు... ప్ర‌యాణికుల‌కు స‌మాచారం చేర‌వేయ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించిన ముగ్గురు సిబ్బందిపై స‌స్పెన్ష‌న్ వేటు వేశార‌ట‌. ఈ ఘ‌ట‌న జ‌రిగిన నేప‌థ్యంలో గ‌న్న‌వ‌రం చేరుకున్న వెంట‌నే మంత్రి ప్ర‌యాణికుల ఇబ్బందుల‌పై, వాటి ప‌రిష్కారంపై తాము విడుద‌ల చేసిన యాప్‌ పై సుదీర్ఘంగా మాట్లాడిన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News