ఆ 108 ఆలయాలకు ఇక అశోకుడే ధర్మకర్త

Update: 2016-04-01 10:57 GMT
అభినవ ఆంధ్రభోజుడిగా పేరున్న విజయనగర వంశానికి చెందిన రాజు పూసపాటి ఆనంద గజపతిరాజు కన్నుమూసి వారమైంది. గత శనివారం విశాఖలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయే నాటికి సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు రాష్ట్రంలోని వందకు పైగా ఆలయాలకు ఆనందగజపతి అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. అయితే తన తదనంతర కాలంలో తన సోదరుడు - టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఆ బాధ్యతలను చేపట్టాలని ఆయన వీలునామాలో రాశారు.
    
ఆనంద గజపతి వీలునామాను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజును ఆనంద గజపతిరాజు స్థానంలో అప్పన్న ఆలయ ధర్మకర్తగా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద గజపతిరాజు ధర్మకర్తగా వ్యవహరించిన మిగిలిన ఆలయాలకు కూడా అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా వ్యవహరిస్తారని సదరు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో త్వరలోనే అశోక్ గజపతిరాజు సింహాచలం ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో పాటు మొత్తం 108 ఆలయాలకు ధర్మకర్తగా ఆయన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోనున్నారు.
Tags:    

Similar News