అశోక్ గీత మార్చేస్తున్న బీసీ పాలిటిక్స్...?

Update: 2022-08-19 01:30 GMT
తెలుగుదేశం పార్టీలో నేనే చంద్రబాబు కంటే సీనియర్ ని అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నాపాత్రుడు అంటారు కానీ నిజానికి ఆ మాట అనగలిగే వాళ్ళు చాలా మంది అదే పార్టీలో  ఉన్నారు. వారిలో అతి ముఖ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు. ఆయన ఒక విధంగా టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు. ఆయన ఎన్టీయార్ పిలుపుని అందుకుని జనతా పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయన జీవిత కాలం అంతా యాంటీ కాంగ్రెస్ రాజకీయం చేశారు. ఆయన ఎదురులేని నాయకుడిగా విజయనగరం జిల్లాలో ఉన్నారు.

ఆయన పూసపాటి వారి వారసుడు, సంస్థానాధీశుడు. రాజులు తమ ఆస్థులను ప్రజల కోసం త్యాగాలు చేశారు. అలా అశోక్ అంటే జనాలకు వల్లమాలిన ప్రేమ, అభిమానం. అందుకే ఆయన ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్ని సార్లూ గెలిపించారు. అయితే కొత్త మిలీనియంలో చోటు చేసుకున్న అనేక సమాజిక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి ప్రభావంతో ఫస్ట్ టైమ్ అశోక్ 2004లో ఇండిపెండెంట్ అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు.

ఆ తరువాత ఆయన 2019 ఎన్నికల్లో మరోసారి బెల్లాల చంద్రశేఖర్ చేతిలో విజయనగరం లోక్ సభ ఎన్నికల్లో రెండవమారు ఓడిపోయారు. అయితే రెండవమారు అశోక్ ఓడిపోయింది బీసీ నేత చేతిలో. అంటే అప్పటికే  రాజకీయం బాగా మారింది అనుకోవాలి. ఇక 2024 ఎన్నికలకు అశోక్ ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి ఆయన ఎట్టి పరిస్థితుల్లో విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తునారు.

అయితే అన్నీ బాగా ఉన్నా కూడా మరోమారు బీసీ నినాదం ఆయన సొంత ఇలాకాలో చెలరేగడం కలవరపెడుతోంది. అశోక్ రాజులు మైనారిటీలు. విజయన‌గరం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఆ వైపు నుంచి నరుక్కురావాలని మాజీ ఎమ్మెల్యే మీసాలా గీత భారీ స్కెచ్ గీస్తున్నారు. అశోక్ వంటి యోధుడి మీదకే బీసీ కార్డుని విసిరి విజాయనగరం ఎమ్మెల్యే టికెట్ తాను కొట్టేయాలని చూస్తున్నారుట. ఆమె 2014 నుంచి 2019 దాకా విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బలమైన తూర్పు సామాజికవర్గానికి చెందిన గీత వాగ్దాటి కలిగిన మహిళా నేతగా గుర్తింపు పొందారు.

ఆమె ఇపుడు టీడీపీ అధినాయకత్వం మీద బీసీ కార్డు తో వత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయనగరంలో బీసీల ఐక్య వేదిక పేరుతో ఫ్లెక్సీలు పెట్టి మరీ కొంతమని నేతలు చేస్తున్న హడావుడి వెనక మీసాల‌ గీత ఉందని అశోక్ వర్గం గమనిస్తోందిట. దాంతో దీనికి విరుగుడు ఏం చేయాలో పాలుపోక రాజా వారి అభిమానులు ఆలోచనలో పడ్డారు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈసారి వైసీపీ కూడా బీసీ కార్డునే వాడుతుంది అని తెలియడంతోనే గీత కూడా ధీమాగా ఇలా చేస్తున్నారు అంటున్నారు.

ఇప్పటికే ఆమె అశోక్ మీద వ్యతిరేకతతో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేరేగా పార్టీ ఆఫీస్ ని కూడా నడుపుతున్నారు. అశోక్ ఉండే ఏ పార్టీ కార్యక్రమంలో ఆమె కనిపించరు. దాంతో ఇలా సాగుతున్న ప్రచ్చన్న యుద్ధం కాస్తా బీసీ కార్డుతో ఇపుడు డైరెక్ట్ అయింది అంటున్నారు.

ఇలా మీసాల గీత బీసీ కార్డుతో ముందుకు వస్తే చంద్రబాబు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒక వైపు మహిళ, తూర్పు కాపు. ఇలా సామాజిక దన్ను ఆమె వైపునే ఉంటుంది. అలాగే అశోక్ వయోవృద్ధుడి అయ్యారన్న కారణంతో ఆయనకు టికెట్ నిరాకరిస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి అశోక్ రాజకీయానికి తాను పుట్టి పెరిగిన  టీడీపీలోనే  పూర్తిగా కానికాలమే నడుస్తోందా అన్నదే అనుచరులకు పట్టుకున్న బెంగ అంటున్నారు.
Tags:    

Similar News