17 నెలల్లో 7సార్లు ఆఫీసుకు రానోడు అఫిడవిట్ చేసుడా?

Update: 2019-11-17 05:40 GMT
ఎంతకూ తెగని పంచాయితీగా మారింది తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె. నలభై రోజులు దాటిపోయినా సమ్మె ఎపిసోడ్ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో మొదలైన సమ్మె.. కేసీఆర్ సర్కారు తీరుతో కార్మిక సంఘాలు కాస్త వెనక్కి తగ్గి.. విలీన డిమాండ్ ను పక్కన పెడుతున్నామని.. మిగిలిన డిమాండ్ల మీద స్పందించాలని కోరారు.

ఒక అడుగు వెనక్కి వేసిన ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ తీరుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోగా.. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్రతో ఆర్టీసీ కార్మికులు ఉన్నారని.. అందుకే వారితో చర్చలు జరపటం కూడా అవసరం లేదన్న రీతిలో అఫిడవిట్ దాఖలు చేశారు.

రహస్యమైన రాజకీయ ఎజెండాతో సమ్మెకు వెళ్లారని.. సంస్థ తీవ్రమైన నష్టానికి గురయ్యేందుకు కారణమయ్యారని ఆరోపించిన ఆర్టీసీ ఇంచార్జి్ ఎండీ సునీల్ శర్మ మాటల్ని.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తీవ్రంగా ఖండించారు. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసు? అని ప్రశ్నించిన ఆయన.. సీఎం తయారు చేయించిన అఫిడవిట్ మీద ఆయన సంతకం చేశారన్నారు.

ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన 17 నెలల వ్యవధిలో కనీసం ఏడు సార్లు కూడా ఆఫీసుకు రాలేదని మండిపడిన ఆయన.. ఆర్టీసీ కార్యాలయంలో పెండింగ్ ఫైల్స్ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయన్నారు. ఆర్టీసీ ఎండీ హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్ రాజకీయ నేతలు దాఖలు చేసినట్లు ఉందన్నారు. ప్రభుత్వ విధానాలే సంస్థ నష్టాలకు కారణమన్న అశ్వత్థామ రెడ్డి మాటల్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా? ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ అఫిడవిట్ ను లెక్కలోకి తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News