భార్య‌ను వంట చేయ‌మంటే హింసించిన‌ట్లు కాదు!

Update: 2018-08-06 16:49 GMT
ఆస‌క్తిక‌ర తీర్పును వెల్ల‌డించింది బాంబే హైకోర్టు. మారిన కాలంలో.. చాలా విష‌యాలు ఇప్పుడు కోర్టుకు వ‌స్తున్నవేళ‌.. ఒక కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించి తీర్పునిచ్చిన కోర్టు మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. రుచిగా వండాల‌ని.. ఇంటి ప‌నులు చేయాల‌ని భ‌ర్త చెప్ప‌టంలో ఎలాంటి త‌ప్పు లేద‌ని కోర్టు పేర్కొంది.

అదెంత‌మాత్రం హింసించిన‌ట్లు కాద‌ని బాంబే హైకోర్టు స్ప‌ష్టం చేసింది. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత బాంబే హైకోర్టు ఒక కేసు తీర్పులో ఈ వ్యాఖ్య‌లు చేసింది.

17 ఏళ్ల క్రితం ముంబ‌యిలోని సంగ్లి ప్రాంతానికి చెందిన విజ‌య్ అనే వ్య‌క్తి త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి భార్య‌ను వేధించేవాడ‌ని.. శారీర‌కంగా హింసించేవాడ‌ని.. అత‌డికి వేరే మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం ఉంద‌ని పేర్కొంటూ భార్య విషం తాగి సూసైడ్ చేసుకుంది. ఇంటి ప‌నులు.. వంట స‌రిగా చేయ‌ని కార‌ణంగా త‌న‌ను త‌న భ‌ర్త రోజూ కొట్టేవాడ‌ని.. లేఖ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న భార్య ఆరోప‌ణ‌లు నిజం కాద‌ని తేల్చింది. భార్య స‌రిగా వంట చేయ‌టం లేద‌ని.. ఇంటి ప‌నులు చూసుకోవ‌టం లేద‌ని భ‌ర్త చెప్పినంత మాత్రాన హింసించిన‌ట్లు కాద‌ని పేర్కొంది. విజ‌య్ హింసించ‌టంతో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా సాక్ష్యాలు లేవ‌న్న కోర్టు.. అత‌డికి ఏ మ‌హిళ‌తోనూ వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్లుగా ఆధారాలు లేవ‌ని పేర్కొంది. ఈ కార‌ణంగా విజ‌య్.. అత‌ని త‌ల్లిదండ్రుల్ని దోషులుగా ప్ర‌క‌టించ‌లేమ‌ని పేర్కొంది. అంతేకాదు.. ప్రాసిక్యూష‌న్ త‌ర‌పు లాయ‌ర్ నిందితుల కుటుంబీకుల‌ను స‌రిగా విచారించ‌లేద‌ని.. కాబ‌ట్టి వారిని దోషులుగా తాము ప్ర‌క‌టించ‌లేమ‌ని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు.


Tags:    

Similar News