షాకింగ్.. వాళ్లకు మంత్రి పదవులు రాలేదా?

Update: 2019-06-07 17:27 GMT
ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వమేర్పడినా ఆ పార్టీ వీరాభిమాన నేతల్లో కొందరికి మాత్రం ఆశాభంగం తప్పలేదు. జగనన్నసీఎం అయితే వారికి తిరిగుండదు అనుకున్న నేతలకు కూడా జగన్ తొలి మంత్రివర్గంలో పదవులు దక్కే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటివరకు అధికారికంగా మంత్రివర్గానికి ఎంపికైన నేతల పేర్లు పార్టీ ప్రకటించనప్పటికీ ఆ పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారంతో చాలా పేర్లు బయటకొచ్చాయి. కానీ, ఆ లిస్టులో కొందరు కీలక నేతల పేర్లు మిస్సయ్యాయి. దీంతో ఆ మిస్సింగ్ నేతలు - వారి అనుచరులు తెగ బాధపడుతున్నారు.

ముఖ్యంగా వైసీపీలో ఫైర్‌ బ్రాండ్‌ గా ముద్రపడ్డ రోజా - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు... సీనియర్ లీడర్ ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మరో కీలక నేత - జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డికి సైతం చోటు దక్కలేదు.

దాదాపుగా ప్రతి జిల్లాలో ఇలాంటి నేతలు కనిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేరు కూడా జాబితాలో కనిపించలేదు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ కు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఏంటీ పరిస్థితి అని టెన్షన్ పడుతున్నారు.

అలాగే గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్‌ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా మంత్రి పదవి దక్కలేదు. అదే జిల్లాలో మర్రి రాజశేఖర్‌ కు గతంలో జగన్ నుంచి హామీ దొరికినా ఇప్పుడు చాన్సు దొరకలేదు. చిలకలూరిపేట నుంచి విడదల రజనీకి టికెట్ కేటాయించడంతో మర్రి రాజశేఖర్‌ కు మంత్రి పదవి ఇస్తానని రోడ్ షోలో ప్రజల ముందు బహిరంగంగా చెప్పిన జగన్ ఇప్పుడు హామీని నిలుపుకోలేదని మర్రి అభిమానులు అంటున్నారు. అలాగే సత్తెనపల్లి ఎమ్మెల్యే.. పార్టీకి బలమైన గొంతుక అయిన అంబటి రాంబాబుకు కూడా నిరాశ తప్పలేదు.

కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్లు శ్రీనివాసులు - రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికీ ఆశాభంగం తప్పలేదు. కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబానికి మంత్రి పదవి రాలేదు.


Tags:    

Similar News