ఆ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?

Update: 2017-02-06 11:56 GMT
సోషల్ మీడియా ఎంత మేలు చేస్తుందో ఒక్కోసారి అంతే స్థాయిలో అడ్డంగా బుక్ చేసేస్తోంది. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో నియంత్రణ, విచక్షణ లేకుంటే దెబ్బతినడం ఖాయమని మరోసారి నిరూపితమైంది. అసెంబ్లీలో తాను ప్రసంగిస్తున్నప్పుడు దాన్ని ఫేస్ బుక్ లో లైవ్ ఇచ్చి సభా నిబంధనలు ఉల్లంఘించిన నేరానికి సస్పెన్షన్ కు గురయ్యాడో ఎమ్మెల్యే.
    
అస్సాంకు చెంది, ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం  అసెంబ్లీలో తాను స్పీచ్ ఇస్తున్నప్పుడు ప్రజలు దాన్ని చూడాలని కోరుకున్నారు.  అందుకోసం ఫేస్ బుక్ ను వాడుకున్నారు.  ఈ నెల 3న అసెంబ్లీలో అక్రమ వలసల సమస్యపై ఆయన ప్రసంగించారు. ఆ సమయంలో ‘ఫేస్ బుక్’ లైవ్ లో పెట్టారు.  అయితే..  ఇతర ఎమ్మెల్యేలు ఈ సంఘటనపై  స్పీకర్ హితేంద్రనాథ్ గో స్వామికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఎథిక్స్ కమిటీతో విచారణ చేపట్టి, ఈరోజు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.
    
సభా నియమాలను అమినుల్ ఉల్లంఘించారని, కొన్ని రోజుల పాటు సభ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని నివేదిక సూచించింది, ఈ నేపథ్యంలో అమినుల్ ను మూడు రోజుల పాటు అంటే ఈ నెల 8వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.  అయితే.. ఈ పనిచేసిన అమీనుల్ అసెంబ్లీకి కొత్తేమీ కాదు. ఆయన చాలా సీనియర్ సభ్యుడు.  కాగా.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన అమీనుల్ కొత్తగా మరో డిమాండు చేశారు.  అసెంబ్లీ కార్యకలాపాలు మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం నిమిత్తం సభలో సభ్యులు ఏమి మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తే బాగుంటుందని ఆయన అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News