జెలెన్ స్కీ పై హత్యాయత్నమా ?

Update: 2022-03-29 05:30 GMT
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని రష్యా వదిలిపెట్టేట్లుగా లేదు. తాజాగా జెలెన్ స్కీపై హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. తమ అధ్యక్షుడిని చంపేందుకు రష్యాకు చెందిన 25 మంది స్పెషల్ సర్వీసెస్ సైనిక బృందాన్ని తమ సైన్యం పట్టుకుందని ఉక్రెయిన్ సైన్యాధికారులు ప్రకటించారు. స్లొవేకియా-హంగరి సరిహద్దుల్లో ఉక్రెయిన్ సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు కీవ్ పోస్టు కథనం అందించింది.

తమ అధ్యక్షుడు జెలెన్ స్కీని హత్యచేయటమే టార్గెట్ గా ఇప్పటికే చాలాసార్లు రష్యాకు చెందిన ప్రత్యేక దళాలు ప్రయత్నించినట్లు సైన్యం ప్రకటించింది. అయితే అన్నీసార్లు రష్యా ప్రయత్నాలను తమ సైన్యం, ఇంటెలిజెన్స్ వర్గాలు సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు సైన్యాధికారులు ప్రకటించారు.

రష్యా తనతో పాటు తన కుటుంబాన్ని హత్యచేయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు యుద్ధం మొదలవ్వకముందునుండే జెలెన్ స్కీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఈనెల మొదటివారంలోనే మూడుసార్లు రష్యా ప్రత్యేక దళాలు జెలెన్ స్కీని హత్యచేయటానికి ప్రయత్నించి విఫలమైన విషయం వెలుగుచూసింది. దాంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వారంలో మూడు సార్లు ఒక దేశాధ్యక్షుడిని హత్యచేయటానికి ప్రయత్నించటం మామూలు విషయం కాదు. ఇలాంటి హత్యలు చేయటం కోసం రష్యాలో సుమారు 10 వేల మందితో ప్రత్యేక సర్వీసెస్ సెక్యూరిటీ దళాలే ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది.

ఈ పదివేలమంది రష్యా అధ్యక్షుడి ఆదేశాల కోసమే 24 గంటలూ వెయిట్ చేస్తుంటారు. ప్రపంచంలో తమ టార్గెట్ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళటం ఇచ్చిన పనిని దిగ్విజయంగా పూర్తి చేయటమే వీళ్ళ బాధ్యత. అయితే వీళ్ళు ఎక్కడన్నా పట్టుబడినా తాము రష్యా సైనికులమని చెప్పుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళల్లో ఎవరు రష్యా సైనికులు కారు. కాకపోతే రష్యా సైనికులకు ఇచ్చే మిలిటరీ ట్రైనింగ్ అంతా ఇచ్చుంటారు.

యుద్ధ మెళకువలు, అత్యంత అధునాతన ఆయుధాల ఉపయోగం, పరిజ్ఞానం, గొరిల్లా ఫైటింగ్ లో మెళకువల్లో వీళ్ళకు నెలల తరబడి ట్రైనింగ్ ఇచ్చుంటారు. ఒకే నెలలో ఇన్ని సార్లు హత్యాయత్నాల నుండి తప్పించుకుంటున్నాడంటే మొత్తానికి జెలెన్ స్కీ అదృష్టవంతుడనే చెప్పాలి.
Tags:    

Similar News