ముంద‌స్తు ప‌క్కా అయితే..అసెంబ్లీ ఫైట్ ఎన్ని రాష్ట్రాల్లో?

Update: 2018-06-26 05:18 GMT
దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి. పేరు.. ప‌ర‌ప‌తి చ‌క్క‌గా ఉన్న‌ప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అందునా.. రోజులు గ‌డిచే కొద్దీ మోడీ ప‌రప‌తి అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న నేప‌థ్యంలో ముంద‌స్తుకు వెళ్ల‌టం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేయాల‌ని భావిస్తోంది బీజేపీ అగ్ర నాయ‌కత్వం. ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వేళ‌.. మోడీకి తిరుగులేద‌ని.. రెండో ట‌ర్మ్ లోనూ ఆయ‌న‌కు ఎదురుండ‌ద‌ని.. విప‌క్షాలు క‌కావిక‌లం కావ‌టం ఖాయ‌మ‌న్న మాట‌లు జోరుగా వినిపించాయి.

అయితే.. ఆ వాద‌న తప్పు కావ‌ట‌మే కాదు.. మోడీకి వ్య‌తిరేకంగా విప‌క్షాలంతా జ‌ట్టు క‌ట్టాయి. ఏం జ‌రిగినా స‌రే.. అంత‌గా అయితే త‌మ‌కు కొంత న‌ష్టం జ‌రిగినా ఫ‌ర్లేదు.. రెండోసారి ప్ర‌ధాని కుర్చీలో మోడీ మాత్రం కూర్చోకూడ‌ద‌న్న బ‌ల‌మైన కాంక్ష‌ను విప‌క్షాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

త‌న మాట‌ల‌తో మెప్పించే మోడీ.. చేత‌ల‌తో మాత్రం దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచేకోలేక‌పోతున్నారు. అంతేనా.. త‌న తీరుతో ప్ర‌జ‌ల‌కు సైతం ఆగ్ర‌హాన్ని క‌లిగేలా చేస్తున్నారు. దీంతో.. మోడీ గ్రాఫ్ అంత‌కంత‌కూ ప‌డిపోతున్న దుస్థితి. దీంతో.. ముంద‌స్తు ఆలోచ‌న లేని క‌మ‌లనాథుల‌కు.. మ‌రో ట‌ర్మ్ ఎన్నిక‌ల్ని కాస్త ముంద‌స్తుగానే తీసుకొస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న చేస్తోంది. ఇప్పుడున్న వ్య‌తిరేక‌త‌ను మేనేజ్ చేయొచ్చ‌ని.. అలా కాకుండా ఎన్నిక‌ల్నిషెడ్యూల్ ప్ర‌కారం వ‌చ్చే ఏప్రిల్ లో ఎన్నిక‌లు జ‌రిగితే త‌మ‌కు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు.దీంతో.. ఈ ఏడాది చివ‌ర‌కే ఎన్నిక‌ల‌కు వెళితే బాగుంటుంద‌న్న  ఆలోచ‌న‌లో మోడీ ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్లే బీజేపీ నేత‌ల నోట ముంద‌స్తు మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉండ‌ట‌మే  కాదు.. ఇటీవ‌ల ఆయ‌న‌తో భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా అందుకు సిద్ధ‌మ‌న్న మాట‌ను చెప్పారు. మోడీతో మీటింగ్ ముందు వ‌ర‌కు ముంద‌స్తు మీద పెద్ద‌గా మోజు ప్ర‌ద‌ర్శించ‌ని కేసీఆర్‌.. ఇప్పుడు ముంద‌స్తుకు సై అంటున్నారు.

తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల సంద‌డి షురూ అయిన‌ట్లుగా ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యంలో మోడీ ఏం నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ముంద‌స్తుకు మోడీ సిద్ధంగా ఉన్నార‌ని చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లతో పాటు.. వీలైన‌న్ని ఎక్కువ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్ని కూడా ఒకేసారి నిర్వ‌హించాల‌ని మోడీ భావిస్తున్నారు.  దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న పావులు క‌దుపుతున్నారు.

ఒక‌వేళ‌.. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేసి.. ఈ ఏడాది చివ‌రి నాటికి ఎన్నిక‌లు నిర్వ‌హించిన ప‌క్షంలో ఎన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. షెడ్యూల్ ప్ర‌కారం అయితే ఈ ఏడాది చివ‌ర్లో ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల్సి ఉంది. ముంద‌స్తు నేప‌థ్యంలో వీలైన‌న్ని ఎక్క‌వ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు.

మ‌రి.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉన్న రాష్ట్రాల్ని చూస్తే.. ఏపీ.. తెలంగాణ‌.. మ‌హారాష్ట్ర.. ఢిల్లీ.. ఒడిశా.. సిక్కిం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. హ‌ర్యానా.. త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. ఈ రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్ర‌కారం చూస్తే.. వ‌చ్చే ఏడాది మే మొద‌లు చివ‌రి వ‌ర‌కూ ద‌శ‌ల వారీగా నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఈసారి అలాంటి ప‌రిస్థితి లేకుండా ఉండేందుకు.. ఒక ఏడాది వ్య‌వ‌ధిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన అన్ని రాష్ట్రాల్లోనూ సార్వ‌త్రికంతో పాటు అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తే.. రాజ‌కీయంగా ల‌బ్థి పొందొచ్చ‌న్న ఆలోచ‌న‌లో మోడీ ప‌రివారం ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల రాష్ట్రప‌తి పాల‌న విధించిన జ‌మ్ముకాశ్మీర్ తో పాటు అనిశ్చితి రాజ‌కీయాలు నెల‌కొన్న త‌మిళ‌నాడులోనూ సార్వ‌త్రికంతో పాటు అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్పుడున్న అంచ‌నా ప్ర‌కారం.. షెడ్యూల్ తో పాటు.. షెడ్యూల్ లో లేని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల్సిన‌వి 15 వ‌ర‌కు ఉంటాయ‌ని చెబుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన రాష్ట్రాలు

+ రాజ‌స్థాన్‌
+ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌
+ ఛ‌త్తీస్ గ‌ఢ్‌
+ మిజోరం

ముంద‌స్తు కానీ జ‌రిగితే అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించే రాష్ట్రాలు

+ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
+ తెలంగాణ‌
+ ఒడిషా
+ సిక్కిం
+ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌
+ త‌మిళ‌నాడు
+ ఢిల్లీ
+ జ‌మ్ముకాశ్మీర్‌
+ హ‌ర్యానా
+ మ‌హారాష్ట్ర
+ జార్ఖండ్


Tags:    

Similar News