కాంగ్రెస్ లో ఆ ఒక్క సీటు కోసం ఐదుగురు..

Update: 2018-07-29 11:35 GMT
వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయం రంజుగా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మహబూబ్ నగర్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు ప్రధాన పార్టీల మధ్య పోరు సాగుతోంది. ఎన్నికలకు ఏడాది ముందే టికెట్ల కోసం పార్టీల్లో సమరం సాగుతోంది.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత ఇబ్రహీం ఈసారి రెండు టార్గెట్లు పెట్టుకున్నారట. ఒకటి టిక్కెట్ దక్కించుకోవడం అయితే రెండోది విజయం సాధించడమట.. ముందు టిక్కెట్ కోసమే ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అధిష్టానం వద్దకు చక్కర్లు కొడుతున్నారట..

నిజానికి ఇబ్రహీం 2009లో టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2012 ఉప పోరులో కూడా ఓడిపోయారు. దీంతో 2014లో ఆయనకు టీఆర్ ఎస్ టిక్కెట్ దక్కలేదు. దీంతో కాంగ్రెస్ లో చేరారు. అయితే అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో 2014 ఎన్నికల్లో రెబల్ గా పోటీచేశారు. అయినా ఓడిపోయారు.  అప్పటినుంచి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారు. మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడం.. మూడు సార్లు ఓడిపోయాడన్న సెంటిమెంట్ తో ఈసారి గెలిపించాలని ప్రజలను కోరుతున్నాడు.

ఇక డీసీసీ ప్రెసిడెంట్ ఓబేదుల్లా కూడా వరుసగా రెండోసారి కాంగ్రెస్ తరఫున మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. పార్టీ పెద్దల అండదండలున్నా తనకే ఈసారి టిక్కెట్ వస్తుందని ఆశపడుతున్నారు.

ఇక మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా గతంలో ఒకసారి గెలిచిన ఎన్నం శ్రీనివాస్ రెడ్డి 2014లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీకి దూరమై ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు.

అలాగే మరో నేత సురేందర్ రెడ్డి కూడా టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కూడా తనకు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే పార్టీ మారుతానని కాంగ్రెస్ పెద్దలను సంప్రదించాడట.. మహబూబ్ నగర్ ముఖ్య కాంగ్రెస్ నేత డీకే అరుణ.. ఎర్రశేఖర్ ను కాంగ్రెస్ లోకి తీసుకొని టిక్కెట్ ఇప్పించాలని వ్యూహరచన చేస్తున్నారట..

ఇంతమంది నేతలు టిక్కెట్ రేసులో ఉండడంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ లో ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎవరికి టికెట్ వస్తుందో తెలియక మహబూబ్ నగర్ కార్యకర్తలు ఎవ్వరికీ జై కొట్టాలో తెలియక తలలు పట్టుకున్నారట..
Tags:    

Similar News