ట్రంప్ దెబ్బ మ‌న‌పై మామూలుగా ప‌డ‌ట్లేదు

Update: 2017-04-20 05:47 GMT
హెచ్-1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ హైర్ అమెరికన్.. బై అమెరికన్ పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రావ‌డంపై దేశీయ ఐటీ సంస్థల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సంచలనాత్మకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ పై ట్రంప్ సంతకం చేయడంతో భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగాలకు గండి పడనుందని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.  హెచ్-1 బీ వీసా నిబంధనల‌ను కఠినతరం చేస్తూ తెచ్చిన ఆర్డ‌ర్ వ‌ల్ల దేశీయ ఐటీ కంపెనీలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనుందని - వ్యయాల భారంతోపాటు ఉద్యోగులపై వేటు కూడా పడనుందని విశ్లేషించింది. ఈ ప‌రిణామాలు ఇటు ఉద్యోగులు - అటు కంపెనీల లాభాలు - వాటి భ‌విష్య‌త్‌ పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

అదేవిధంగా హెచ్-1బీ వీసాల జారీలో భారత్ 86 శాతం వాటా కలిగి ఉండగా ప్రస్తుతం ఇది 60 శాతానికి పరిమితం కావచ్చునని అసోచామ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చే రెమిటెన్స్‌ లు కూడా భారీగా తగ్గనున్నాయని అసోచామ్ విశ్లేషించింది. ప్రతీ ఏటా 10.96 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ అమెరికా నుంచి భారత్‌ కు వస్తుండగా.. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో కనీసం 8 నుంచి 10 శాతం పడిపోవచ్చని తెలిపింది. వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రెమిటెన్స్ పంపించడంలో అమెరికాకు భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా రెమిటెన్స్‌లు వస్తున్నాయి. రూపాయి మారకం విలువ పెరుగడం, పరిశ్రమల ఆదాయం తగ్గడం వల్ల నిర్వహణ భారాన్ని తగ్గించడానికి ఉద్యోగుల సంఖ్యలో భారీ స్థాయిలో కోత పెట్టేందుకు అధిక ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. గడిచిన మూడు నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 శాతం బలపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News