రూ.30 లక్షల సంగతేంది కేసీఆర్ సాబ్?

Update: 2015-09-17 09:42 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాస్తంత ఇబ్బందికర పరిస్థితి. పార్టీ అధినేత అయిన కేసీఆర్ కు సంబంధించిన ఎన్నికల ఖర్చు విషయం ఇప్పుడు వివాదంగా మారింది. ఆయన తన ఎన్నికల కోసం పెట్టిన ఖర్చు  విషయంలో వచ్చిన వ్యత్యాసం ఆయనవైపు వేలెత్తి చూపేలా చేస్తున్న పరిస్థితి.

ఎన్నికల సందర్భంగా పెట్టే ఖర్చుకు.. ఎన్నికల కమిషన్ కు చూపించే విషయంలో ఉండే వ్యత్యాసాలు ఎంతన్నది బహిరంగ రహస్యాలే. అయితే.. అలా చేసే పనిలోనూ కచ్ఛితత్వం లేకుండా.. ప్రశ్నలు వేసేలా.. వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోవటం గమనార్హం. మిగిలిన వారి సంగతి పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ఖర్చుకు సంబంధించిన లెక్క సరిగా తేలకపోవటం.. ఆ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ బయటపెట్టటం తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారింది.

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏంపీగా తాను పెట్టిన..  ఖర్చుకు సంబంధించి రూ.70లక్షలు ఖర్చు అయినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన లెక్కలో రూ.70.05లక్షల ఎన్నికల ఖర్చుగా చూపిస్తే.. ఆయన పార్టీకి సంబంధించిన ఎన్నికల లెక్కలో మాత్రం రూ.కోటిగా పేర్కొన్నారు. ఇలా రెండు లెక్కలు పొంతన లేకుండా ఉండటం.. మొత్తంగా రూ.30లక్షలు తేడా రావటాన్ని ప్రశ్నిస్తున్నారు.  ఈ విషయాల్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో ప్రముఖంగా పేర్కొంది. మరి.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో. ఇంతకీ రూ.30లక్షల సంగతేంది కేసీఆర్ సాబ్..?
Tags:    

Similar News