కరోనా కొత్త వేరియంట్ పై ఆస్ట్రాజెనెకా సమర్థవంతం!

Update: 2021-05-25 02:30 GMT
కరోనా కొత్త వేరియంట్ బి.1.617.2 రకంపై ఆస్ట్రాజెనెకా టీకా సమర్థవంతంగా పని చేస్తోందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వెల్లడించింది. కొత్తగా వెలుగుచూస్తున్న వైరస్ వేరియంట్లపై టీకాల సామర్థ్యంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. భారతదేశంలో విశ్వరూపం చూపిస్తున్న బి.1.617.2 రకం వేరియంట్ పై టీకాల సమర్థతను లండన్ పరిశోధకులు వెల్లడించారు.

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకా వైరస్ కొత్త వేరియంట్లను ఎదుర్కొవడంలో సమర్థవంతంగా పని చేస్తోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. రెండు డోసుల అనంతరం వైరస్ నుంచి 60శాతం కలిగిస్తోందని లండన్ నిపుణులు తెలిపారు. ఇది మరణాల రేటును తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఆస్పత్రి అవసరాన్ని నియంత్రిస్తుందని తేల్చారు. రాబోయే కరోనా కొత్త వేరియంట్లను ఈ టీకా సమర్థవంతంగా ఎదుర్కొగలదని స్పష్టం చేశారు.

కొవిడ్ వేరియంట్లపై టీకాల ప్రభావం అంశంపై ఏప్రిల్ 5 నుంచి మే 16 వరకు నిర్వహించిన అధ్యయనంలో ఈ కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఈ కొత్త వేరియంట్ పై అమెరికా ఫైజర్ టీకా 88 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని నివేదికలో పేర్కొన్నారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత ఫైజర్ 88 శాతం, కొవిషీల్డ్ 60 శాతం ప్రభావం చూపుతున్నాయని తేల్చారు. ఈ రెండు వ్యాక్సిన్ల మొదటి డోసు అనంతరం మూడు వారాల తర్వాత 33 శాత రక్షణ కల్పిస్తున్నాయని తేల్చారు.

భారత్ లో తొలిసారిగా గుర్తించిన ఈ వేరియంట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి పరిశోధకులు తెలిపారు. కాబట్టి కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో కట్టడి చేయాలని భావిస్తున్నారు. సమర్థవంతంగా పని చేస్తున్న దృష్ట్యా అస్ట్రాజెనికా టీకాను పంపిణీ చేయడంలో వేగం పెంచాలని నిర్ణయించారు. భారతదేశం, యూకే, ఇతర దేశాల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఎక్కువ శాతం మన దేశ అవసరాలకే ఉపయోగిస్తామని సీరమ్ అధినేత ఆధార్ పూనావాలా ఇప్పటికే ప్రకటించారు. 
Tags:    

Similar News