కోవింద్ లో కొత్త కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది

Update: 2018-01-29 13:43 GMT
అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారు ఎవ‌రైనా స‌రే.. హ‌డావుడి చేసే అవ‌కాశం వ‌స్తే అస్స‌లు వ‌దులుకోరు. కుటుంబ స‌భ్యుల‌కు.. స‌న్నిహితుల‌కు.. స్నేహితుల‌కు.. బంధుమిత్రుల‌కు పెద్ద‌పీట వేయ‌టం క‌నిపిస్తుంది. కానీ.. కొంద‌రు వీవీఐపీలు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ద‌శాబ్దాల ప‌ర్యంతం హ‌డావుడి య‌వ్వారాల‌కు పెద్ద‌పీట వేస్తున్న వీవీఐపీల‌కు భిన్నంగా ఈ మ‌ధ్య‌న కొత్త త‌ర‌హాకు తెర తీస్తున్నారు కొంద‌రు ప్ర‌ముఖులు. ఇప్పుడా కోవ‌లోకే వ‌స్తారు రాష్ట్రప‌తి రాంనాథ్ కోవింద్‌.

సింఫుల్ గా క‌నిపించే ఆయ‌నకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు కొన్ని ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఆర్భాటాల‌కు దూరంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తీరు ప‌లువురు ప్ర‌శ‌సంస‌ల్ని అందుకుంటోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎట్ హోం కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా కోవింద్ మార్క్ స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని చెబుతున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వం.. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల‌ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ఎట్ హోం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంటారు. రాష్ట్ర స్థాయిలో గ‌వ‌ర్న‌ర్‌.. జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్ నేతృత్వంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది.

వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు.. స‌ద‌రు ప్ర‌ముఖుడు (రాష్ట్రప‌తి.. గ‌వ‌ర్న‌ర్‌.. క‌లెక్ట‌ర్‌)కు ప‌రిచ‌య‌స్తులు.. తెలిసిన వారు.. కుటుంబ స‌భ్యులు ఇలా ఎవ‌రినైనా ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తుంటారు. అన్ని వ‌ర్గాల ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యే ఈ కార్య‌క్ర‌మానికి ఇన్విటేష‌న్ అంద‌టం ఒక గొప్ప‌గా భావించే వారుంటారు.

ఎట్ హోంలో ప్ర‌ముఖులు స‌ర‌దాగా క‌ల‌వ‌టం.. భేటీ కావ‌టం.. అల్పాహారం తీసుకోవ‌టం.. ఆత్మీయ ప‌ల‌క‌రింపుల‌కు వేదిగా ఉంటుంది. రాష్ట్రప‌తి హోదాలో తొలిసారి ఎట్ హోం కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కోవింద్‌.. దీనికి త‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా దూరంగా ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  గ‌తంలో మాదిరి హ‌డావుడిగా కాకుండా సింపుల్ గా ఉండాల‌న్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెబుతారు. గ‌త సంవ‌త్స‌రం రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఎట్ హోంకు 2015 మందిని ఆహ్వానించారు. అంత‌కు ముందు ఏడాది అయితే ఏకంగా 2347 మందిని ఆహ్వానించారు.

ఇందుకు భిన్నంగా కోవింద్ మాత్రం కేవ‌లం 724 మందినే ఆహ్వానించ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌ణ‌బ్ వార‌సుడిగా ప‌ద‌విని చేప‌ట్టిన కోవింద్‌.. ఆయ‌న మాదిరి హ‌డావుడి చేయ‌కుండా అతి త‌క్కువ మందితో ఎట్ హోం కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయ‌టం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌కు పెద్ద పీట వేయ‌కుండా.. ప్రేర‌ణ పొందే వ్య‌క్తుల‌తో రాష్ట్రప‌తి భ‌వ‌న్ క‌ళ‌క‌ళ‌లాడాన్న‌ట్లుగా ఆయ‌న భావించిన‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా త‌న కుటుంబీకుల‌కు ఆహ్వానాలు పంపొద్ద‌ని చెప్పిన ఆయ‌న‌.. అరుదైన వ్య‌క్తుల‌కు.. విశేష ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించిన వారికి.. ఆయా రంగాల్లో అద్భుత ప‌ని తీరు సాధించిన వారిని మాత్ర‌మే ఆహ్వానించారు.

రిప‌బ్లిక్ డే వేడుకుల‌కు వ‌చ్చిన వివిధ దేశాధినేత‌లు.. వారి ప్ర‌తినిధులు.. ఉప రాష్ట్రప‌తి.. ప్ర‌ధానితో పాటు ఆయ‌న కేబినెట్ మంత్రుల‌కు.. ముఖ్య అధికారుల‌కు ఆహ్వానం పంపారు. అదే స‌మ‌యంలో అమ‌ర‌వీరుడు.. అశోక చ‌క్ర జ్యోతి ప్ర‌కాష్ నిరాలా కుటుంబంతోపాటు అండ‌ర్ 17 ఇండియ‌న ఫుట్ బాల్ టీం సార‌థి అమ‌ర్ జిత్ సింగ్‌.. ద‌ళిత్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీస్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన మిలింద్ కాంబ్లేతో వివిధ రంగాల‌కు చెందిన స్ఫూర్తిదాత‌ల‌ను ఆహ్వానించిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.  మొత్తంగా.. కొత్త సంప్ర‌దాయానికి తెర తీసేలా కోవింద్ వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News