డ‌బ్బుల‌న్నీ జ‌నాల ద‌గ్గ‌రే..బ్యాంకుల్ని న‌మ్మ‌ట్లేద‌ట‌

Update: 2018-06-11 04:48 GMT
న‌ల‌భై ఏళ్ల‌ల్లో కాంగ్రెస్ చేయ‌లేని ప‌ని నల‌భై నెల‌ల పాల‌న‌తో తాము చేసిన‌ట్లుగా మోడీ ప‌రివారం మా గొప్ప‌గా ప్ర‌చారం చేసుకోవ‌టం తెలిసిందే. ఇప్పుడీ మాట నిజ‌మేన‌ని.. విప‌క్షాలు అధికార‌ప‌క్షంపై దుమ్మెత్తి పోసే కొత్త లెక్క‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. మోడీ నాలుగేళ్ల పాల‌న పుణ్య‌మా అని బ్యాంకుల‌పై సామాన్య ప్ర‌జ‌ల్లో అనుమానాలు ఎంత‌గా పెరిగాయ‌న్న విష‌యం గ‌ణాంకాల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గ‌డిచిన కొన్నేళ్లుగా ఎప్పుడూ లేని రీతిలో ప్ర‌జ‌లు క‌రెన్సీని త‌మ వ‌ద్ద‌నే దాచుకుంటున్న వైనం లెక్క‌ల‌తో స‌హా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పెద్ద‌నోట్ల ర‌ద్దు పేరుతో మోడీ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. తాను చేప‌ట్టిన చ‌ర్య‌తో బ్లాక్ మార్కెట్ దందాతో పాటు.. న‌ల్ల‌ధ‌నం గుట్టు ర‌ట్టు అవుతుంద‌ని.. బ్లాక్ మ‌నీ పెద్ద మొత్తంలో ప్ర‌భుత్వం చేతికి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు వినిపించాయి.

అయితే.. అవ‌న్నీ ఉత్త మాట‌లేన‌న్న వైనం పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం అంద‌రికి అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. అంతేనా.. గ‌తానికి భిన్నంగా బ్యాంకుల్ని న‌మ్మ‌కుండా ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద‌నే డ‌బ్బు దాచుకోవ‌టం అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్న వైనం గ‌ణాంకాల‌తో స‌హా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ కార‌ణంతోనే బ్యాంకుల్లో తీవ్ర‌మైన న‌గ‌దు కొర‌త‌తో పాటు.. ఒక‌ప్పుడు ఎనీటైం మ‌నీగా సుప‌రిచిత‌మైన ఎటీఎంలు ఇప్పుడు ఎనీ టైం మూసివేసి ఉంచ‌ట‌మే అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారింది.

2016 అక్టోబ‌రులో రూ.17ల‌క్ష‌ల కోట్లు ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర ఉండ‌టం ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చేటుగా అభివ‌ర్ణిస్తూ.. బ్లాక్ మ‌నీతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నా భిన్నం అవుతుంద‌న్న ఉద్దేశంతో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు ప్ర‌క‌ట‌న‌ను చేశారు మోడీ.

అయితే.. త‌ర్వాతి రోజుల్లో చోటు చేసుకున్న ప‌రిణామాలు ఒక ఎత్తు అయితే.. ఇటీవ‌ల కాలంలో దేశ ప్ర‌జ‌ల్లో బ్యాంకుల మీద న‌మ్మ‌కం త‌గ్గి.. తాము సంపాదించిన సొమ్మును ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద‌నే ఉంచుకోవ‌టం అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీంతో ల‌క్ష రూపాయిల క్యాష్ కోసం బ్యాంకుల‌కు వ‌స్తున్న ఖాతాదారుల‌కు రేపు రావాల‌ని.. కాస్త టైం ఇవ్వాల‌న్న మాట‌ను కొంద‌రు బ్యాంక‌ర్లు చెప్ప‌టం క‌నిపిస్తోంది.

తాజాగా విడుద‌లైన భార‌త రిజ‌ర్వ్ బ్యాంక్ నివేదిక‌ను చూస్తే.. మోడీ స‌ర్కారు వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. అన్నింటికి మించి ప్ర‌ధాని మోడీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం కార‌ణంగా దేశంలో ఎలాంటి వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌న్న విష‌యం తాజాగా విడుద‌లైన రిజ‌ర్వ్ బ్యాంక్ నివేదిక ఒక‌టి బ‌య‌ట పెట్టింద‌ని చెప్పాలి. గ‌ణాంకాల ప్ర‌కారం 2014లో దేశ ప్ర‌జ‌లు ఖ‌ర్చు పెట్ట‌కుండా త‌మ వ‌ద్ద దాచుకున్న మొత్తం క‌రెన్సీ విలువ రూ.13 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే. 2016లో పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి ముందు.. ఇది రూ.16కోట్లుగా రికార్డు అయ్యింది. ఈ స‌మ‌యంలోనే బ్లాక్ మ‌నీ పై పాశుప‌తాస్త్రంగా పేర్కొంటూ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

అయితే.. ఈ నిర్ణ‌యం విక‌టించింద‌ని.. అనంత‌ర కాలంలో బ్యాకింగ్ వ్య‌వ‌స్థ మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో జ‌నాల్లో భ‌యాందోళ‌న‌లు ఎక్కువ‌య్యాయి. దీనికి త‌గ్గ‌ట్లే బ్యాంకుల్లో క్యాష్ ను డిపాజిట్ చేసే వారి సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది.  పెద్ద‌నోట్ల ర‌ద్దు వేళ అంటే.. 2017 జ‌న‌వ‌రి నాటికి ప్ర‌జ‌ల వ‌ద్ద అత్య‌ల్ప స్థాయిలో న‌గ‌దు ఉన్న‌ట్లు తేలింది. అప్పట్లో దేశ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర అత్య‌ల్పంగా రూ.7.8ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర రూ.18.5ల‌క్ష‌ల కోట్ల క్యాష్ దేశ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌ ఉన్న‌ట్లుగా గుర్తించారు. అయితే.. బ్యాంకుల మీద ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం త‌గ్గిపోవ‌టంతో.. డిపాజిట్ చేసే వారి సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం దేశ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర రూ.18.5 ల‌క్ష‌ల కోట్లు ఉండిపోయిన‌ట్లుగా తేలింది. ఇదే రీతిలో కొన‌సాగితే.. బ్యాంకులు మ‌రింత‌ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కోవ‌టం ఖాయ‌మంటున్నారు. రూ.2వేల నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్నార‌న్న ఊహాగానాలు..మొండి బ‌కాయిల‌తో ప‌లు బ్యాంకులు దివాలా తీస్తాయ‌న్న భ‌యాందోళ‌న‌లు వెరిసి.. బ్యాంకుల్లో డ‌బ్బు దాచేందుకు జ‌నాలు వెన‌కాడుతున్నారు.
 
మోడీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ బ్యాంకుల్లో ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉంచుకుంటున్న న‌గ‌దు లెక్క‌ల్ని చూస్తే..

ఏడాది            ప్ర‌జ‌లు త‌మ వ‌ద్దే ఉంచుకున్న న‌గ‌దు

2014                         రూ.13     ల‌క్ష‌ల కోట్లు
2015                         రూ.14.5 ల‌క్ష‌ల కోట్లు
2016                         రూ.17ల‌క్ష‌ల కోట్లు
2017                         రూ.7.8ల‌క్ష‌ల కోట్లు
2018 (మే వ‌ర‌కు)          రూ.18.5ల‌క్ష‌ల కోట్లు


Tags:    

Similar News