రాఖీ స్పెషల్ : బంగారం స్వీటు 9వేలకే..

Update: 2018-08-21 12:33 GMT
 ఈ ఆగస్టు 26 ఆదివారం .. సోదర-సోదరీమణుల అప్యాయతకు చిహ్నమైన ‘రక్షాబంధన్’ వేడుక రాబోతోంది. దీనికోసం ఇప్పటినుంచే అక్కలు - చెల్లెల్లు రెడీ అయిపోతున్నారు. తమ ప్రియమైన సోదరుడికి రాఖీ కట్టి స్వీటు నోట్లో పెట్టి ప్రేమానురాగాలు చాటేందుకు సిద్ధమయ్యారు.

గుజరాత్ రాష్ట్రంలో రక్షాబంధన్ వేడుక అంగరంగ వైభవంగా సాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సూరత్ పట్టణానికి చెందిన ‘ప్రిన్స్ మిఠాయివాలా’ అనే కార్పొరేట్ స్వీటు షాపు ఈసారి వినూత్నంగా స్వీటును తయారు చేసింది. మాములుగా స్వీటుపై వెండిపూతను మనం చూస్తుంటాం. కానీ ఈ నిర్వాహకులు స్వీటుపై బంగారు పూత పూశారు. అదీ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన బంగారంతో తయారు చేశారు.. ఇది దేశంలోనే వినూత్నమైన స్వీటు అని వారు పేర్కొంటున్నారు. దీనికి ‘24 క్యారెట్ మిఠాయి మ్యాజిక్’ అని పేరు కూడా పెట్టారు.

రాఖీ పండుగ నాడు వెరైటీగా చేయాలని ఆలోచించి బంగారుపూత గల స్వీట్లను తయారు చేసినట్లు ప్రిన్స్ మిఠాయివాలా ఓనర్ తెలిపారు. ఈ స్వీటును స్వచ్ఛమైన నెయ్యి, డ్రైఫ్రూట్స్ తో తయారు చేశామని.. దాని మీద బంగారు పూతను పూసినట్లు తెలిపారు. ఇంతవరకూ దేశంలో వెండిపూతగల స్వీటు మాత్రమే చూశామని.. కానీ ఇది దేశంలోనే మొదటి బంగారు పూత స్వీటు అని ఆయన ఘంఠాపథంగా చెబుతున్నారు.

ఈ బంగారుపూత స్వీటు ఖరీదు కూడా పెద్దగా లేదు. కేవలం రూ.9000కు ఒక కిలో మాత్రమే. బంగారు స్వీట్లుగా పిలిచే దీనికి ఇప్పుడు సూరత్ లో డిమాండ్ ఎక్కువైంది. అన్నాదమ్ముల కోసం రూ.9వేలు పెట్టడం లెక్క కాదని చాలామంది కిలోల కొద్దీ తీసుకెళ్తున్నారట.. ఈ బంగారు స్వీటు ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని.. ఎవరూ భయపడకుండా కొనొచ్చని దుకాణాదారులు భరోసానిస్తున్నారు.
Tags:    

Similar News