జాతీయ పార్టీ ప్రకటన వేళా.. ఏపీని ఏసుకోనున్నారా?

Update: 2022-10-03 04:16 GMT
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ నుంచి దాదాపు తొమ్మిదేళ్లు (రెండు మూడు నెలల తేడాతో) ఏలిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్.. ఇప్పుడు తన ఫోకస్ ను జాతీయ రాజకీయాల మీద నిలపటం తెలిసిందే. 68 ఏళ్ల వయసులో భారీ లక్ష్యాన్ని చేధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటల వేళలో తెలంగాణ భవన్ లో జాతీయ పార్టీకి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్న ఆయన.. అంతకుముందు పార్టీకి చెందిన కీలక నేతలతో భేటీ అయి.. పార్టీకి సంబంధించిన నిర్ణయాన్ని వారితో పంచుకున్న తర్వాత.. ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనేం మాట్లాడనున్నారు? ఎలాంటి వాదనను వినిపిస్తున్నారు? ప్రధాని మోడీపైన ఆయన చేయనున్న వ్యాఖ్యలు ఏమిటి? లాంటి ప్రశ్నలెన్నో తెర మీదకు వస్తున్నాయి.
ఇక్కడే మరో ఆసక్తికర అంశం చర్చకు వస్తోంది. తన రాజకీయ ప్రయాణాన్ని తరచూ చెప్పుకునే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం గురించి..

ఆ సందర్భంగా ఉమ్మడి పాలకుల మీదా.. ఏపీ మీదా ఘాటు విమర్శలు చేసే కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటన వేళ.. ఎలాంటి తీరును ప్రదర్శిస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎప్పటి మాదిరి తనకు అలవాటైన రీతిలో తెలంగాణ రాష్ట్ర సాధన గురించి చెప్పుకొస్తూ.. ఉమ్మడి పాలకులు.. వారి తీరు గురించి తిట్టేస్తారా? లేదంటే అందుకు భిన్నంగా ఆ ప్రస్తావన తేకుండా జాతీయ రాజకీయాలకే విషయాల్ని పరిమితం చేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

లక్ష్యం జాతీయ పార్టీ అయినప్పుడు.. అందరిని కలుపుకుపోయేలా ఉండాలే తప్పించి.. గతాన్ని ప్రస్తావిస్తూ.. తన విజయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవటం తప్పే అవుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఆలోచనలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విభజన వేళ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. రాజ్యసభలో ప్రకటించిన వేళ.. దాని విషయంలో కేసీఆర్ ఏం చెబుతారన్నది ఇప్పుడు ప్రశ్న.
పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి చేసిన ప్రత్యేక హోదా ప్రకటనను తాను ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ ఎలాంటి స్టాండ్ ను వినిపించనున్నారు?

అన్నది ఒక ప్రశ్న అయితే.. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని జాతీయ పార్టీ అధినేతగా ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెబుతారు? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఎలా అయితే.. సెక్రటేరియట్ కు రాకుండానే తొమ్మిదేళ్లుగా సీఎంగా పాలన చేస్తున్నారో.. ఒకవేళ దేశ ప్రధాని అయితే.. పీఎంవోకు వెళ్లకుండా ఫామ్ హౌస్ అలియాసర్ ఫార్మర్ హౌస్ నుంచే చక్రం తిప్పుతారా? అసలు ఢిల్లీలో ఉంటారా? లేదంటే.. హైదరాబాద్ కేంద్రంగానే పని చేస్తారా? లాంటి ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఏమిటి? అన్న ప్రశ్నల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నల్ని హైదరాబాద్ మీడియా నుంచి ఎదుర్కోవటం ఈజీ కానీ.. ఢిల్లీ మీడియాతో కష్టమని భావించే పార్టీ ప్రకటనను సొంత అడ్డా నుంచి చేయాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా తనకు అలవాటైన విభజన ముచ్చటను ప్రస్తావన ఏ మేరకు ఉంచుతారన్నది కీలకంగా మారింది. జాతీయ పార్టీగా అందరిని కలుపుకు వెళ్లేలా ఉండేలా తప్పించి.. కేసీఆర్ కు అలవాటైన ఆంధ్రా వ్యతిరేకతను ప్రదర్శిస్తారా? లేదా? అన్నదిప్పుడుఆసక్తికరమని చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News