అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే ప‌ద‌వికి గండం!

Update: 2019-07-09 05:01 GMT
గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో టీడీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల ఎన్నిక‌లు చెల్ల‌వన్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ప‌లు న్యాయ‌స్థానాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు కూడా. తాజాగా ఇలాంటి ఇబ్బందినే మాజీ మంత్రి క‌మ్ టెక్క‌లి ఎమ్మెల్యే కించ‌రాపు అచ్చెన్నాయుడు ఎదుర్కొంటున్నారు. ఆయ‌న ఎన్నిక చెల్ల‌దంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

నామినేష‌న్ సంద‌ర్భంగా త‌న‌పై ఉన్న కేసుల్ని అఫిడ‌విట్ లో పొందుప‌ర్చాల్సిన అచ్చెన్నాయుడు ఆ ప‌ని చేయ‌లేద‌ని.. కొన్ని క్రిమిన‌ల్ కేసుల వివ‌రాల్ని దాచిపెట్టి ఎన్నిక‌ల క‌మిష‌న్ ను త‌ప్పుదోవ ప‌ట్టించిన‌ట్లుగా టెక్క‌లి వైఎస్సార్ కాంగ్రెస్ నేత పేరాడ తిల‌క్ పేర్కొన్నారు. 2017లో ఓబులాపురం మైనింగ్ వ‌ద్ద దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ‌ట్లు అభియోగం ఎదుర్కొంటున్న అచ్చెన్న ఆ వివ‌రాల్ని త‌న అఫిడ‌విట్ లో వెల్ల‌డించ‌లేద‌ని చెబుతున్నారు. ఇదే అభియోగం మీద అచ్చెన్న‌తో పాటు మ‌రో 20 మందిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

మార‌ణాయుధాల‌తో అప్ప‌టి ఎమ్మెల్యే నాగం జ‌నార్ద‌న‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో మైనింగ్ ఆఫీసులో ఆస్తుల‌ను ధ్వంసం చేశార‌ని.. అడ్డుగా వ‌చ్చిన పోలీసుల‌ను తోసి వారిని తిట్ట‌టంతో అచ్చెన్న‌పై అప్ప‌ట్లో కేసులు న‌మోద‌య్యాయి. రాయ‌దుర్గం కోర్టు కేసులోనూ అచ్చెన్న 21వ ముద్దాయిగా ఉన్నారు. కోర్టుకు హాజ‌రు కాని కార‌ణంగా న్యాయ‌మూర్తి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఇదే కేసును ఇప్పుడు విజ‌య‌వాడ‌లోని ప్ర‌త్యేక కోర్టుకు బ‌దిలీ చేశారు. ఈ వివ‌రాల్ని ఎన్నిక‌ల అఫిడ‌విట్ లోని ఫారం 26లో అచ్చెన్న న‌మోదు చేయ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

నామినేష‌న్ పత్రంలో వివ‌రాల్ని స‌రిగా న‌మోదు చేయ‌ని అచ్చెన్న ఎన్నిక‌ను ర‌ద్దు చేసి.. ఆ త‌ర్వాత స్థానంలో ఓట్లు పొందిన త‌న‌ను ఎన్నికైన‌ట్లుగా ప్ర‌క‌టించాల‌ని పేరాడ తిల‌క్ వెల్ల‌డించారు. సీనియ‌ర్ నేత అయిన అచ్చెన్న నామినేష‌న్ ప‌త్రాల్లో వివ‌రాల్ని పూర్తిగా ఎందుకు వెల్ల‌డించ‌లేదు?  ఎక్క‌డ త‌ప్పు దొర్లింది?  తాజా పిటిష‌న్ పై కోర్టు ఎలా రియాక్ట్ కానుంది?  అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News