ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 తెలుగు రాష్ర్టాల్లో ఈ అంశాలే కీలకంగా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అంశాలపై సీరియస్ చర్చ సాగుతోంది. సెక్షన్ 8 ద్వారా హైదరాబాద్ వ్యవహారాలు రెండు తెలుగు రాష్ర్టాల ప్రథమ పౌరుడు అయిన ఈఎస్ఎల్ నరసింహన్ చేతుల్లోకి పెట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందనే వార్త రెండు రాష్ర్టాల్లోనూ ఒక్కసారిగా హీట్ ను పెంచింది.
సెక్షన్ 8ను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని ఏపీ నాయకులు, మంత్రులు డిమాండ్లు చేస్తున్నారు. అలా చేయవద్దు, ఒకవేళ చేస్తే మేం ఆందోళనలు, దీక్షలు చేస్తామంటూ తెలంగాణవాదులు బహిరంగ స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఒకదశలో నిరాహార దీక్షలు సైతం చేపడుతామనే ప్రకటనలు చేశారు. అయితే తెలంగాణవాదుల ప్రకటనలపై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒకింత వ్యంగ్యంగా స్పందించారు.
విభజన చట్టంలోనే ఉన్న సెక్షన్ 8ను వద్దనటం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్షన్-8ను వ్యతిరేకించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. పైగా కొన్నివర్గాలు నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం ఏమిటని అచ్చెన్న ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిరాహార దీక్షలు చేస్తే చట్టాలు మారతాయనుకుంటే తాము కూడా లక్ష మందితో దీక్షలు చేస్తామని, విభజన చట్టం వెనక్కు వెళ్తుందా? అని ప్రశ్నించారు. గవర్నర్ సెక్షన్-8ను వినియోగించుకొని హైదరాబాద్ లో ఉన్న జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌బోర్డు లాంటి సంస్థలను తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. అప్పుడే ఇరు రాష్ర్టాలకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పారు.