మోడీ కొంప ముంచుతున్న ఏటీఎంలు?

Update: 2016-11-13 16:24 GMT
పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన విషయాల్ని ప్రకటించిన ప్రధాని మోడీ.. రెండు.. మూడు రోజుల్లో పరిస్థితి మొత్తం సర్దుకుంటుందని.. ప్రజలకు ఇబ్బందులు కలగవని.. బ్యాంకుల్లో డబ్బులు మార్చుకోవటం.. డిపాజిట్లు చేసుకోవటంతో పాటు.. ఏటీఎంలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త నోట్లు తీసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. దీంతో చాలామంది మోడీ మాటను నమ్మారు. అయినప్పటికీ కొందరు ఎందుకైనా మంచిదని.. మోడీ మాట విన్న వెంటనే ఏటీఎం వద్దకు పరుగులు తీశారు.

ఈ సందర్భంగా ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవాలన్న తొందర్లో వంద రూపాయిల నోట్లు తీసుకోవాల్సిన స్థానే.. వెయ్యి.. రూ.500 నోట్లు వచ్చేలా భారీ మొత్తాల్ని కోరుకొని చేతిలోకి చెల్లని నోట్లను (తాత్కాలికంగా బయట చెల్లవు కానీ బ్యాంకుల్లో చెల్లుతాయి) తీసుకున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. కేంద్రం విధించిన రెండు రోజుల తర్వాత నుంచి ఏటీఎంలు పని చేయటం ప్రారంభించినా.. క్యాష్ ను లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే.. ఏటీఎంలలో క్యాష్ నిండుకోవటంతో ప్రజల ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి.

ఏటీఎంలలో కోరుకున్నంత క్యాష్ లేదన్న మాటతో జనాల్లో మరింత ఆందోళన పెరిగింది. దీంతో.. బ్యాంకు వల్ల బారులు తీరే వారు మరింత పెరిగిన పరిస్థితి. ఎందుకిలా జరిగింది? బ్యాంకులు పని చేయటం మొదలు పెట్టిన వెంటనే పరిస్థితి మామూలు అయిపోతుందని.. మూడు.. నాలుగు రోజులు ఓపిక పడితే అందరి చేతికి కోరుకున్నంత డబ్బు వస్తుందన్న ప్రచారానికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటం ప్రజల్లో అసంతృప్తిని రోజురోజుకీ పెంచేస్తోంది.

మరి.. మోడీ చెప్పినట్లుగా మూడు నాలుగు రోజుల్లో పరిస్థితి ఎందుకు చక్కబడలేదన్న విషయంలోకి వెళితే.. గ్రౌండ్ రిపోర్ట్ ను చెక్ చేసే ప్రయత్నం చేస్తే వచ్చిన విషయాలు ఆశ్చర్యంగా.. ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. ప్రజలు కోరుకున్న స్థాయిలో ఏటీఎంలు పని చేయకపోవటానికి కారణం.. సాంకేతిక అంశాల్ని ప్రభుత్వం గుర్తించకపోవటంగా చెప్పాలి.

ఇప్పుడున్న  విధానం ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు మొత్తం రూ.1000.. రూ.500.. రూ.100 నోట్లను మాత్రం ఇచ్చేలా డిజైన్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.2వేల నోట్లకు కొత్త బాక్సుల్ని తయారు చేయించాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దు వెంటనే దేశ వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అన్నీ బ్యాంకు ఏటీఎంలలో వాటిని ఏర్పాటు చేసి ఉంటే చాలా వరకూ ఇబ్బందే ఉండేది కాదు. కానీ.. ఈ కీలకమైన పాయింట్ విషయంలోకేంద్రం కాస్తంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పాలి.

ఇదొక పాయింట్ అయితే.. ఇప్పుడున్న ఏటీఎంలు వెయ్యి.. రూ.500.. రూ.100 నోట్లను తప్పించి మిగిలిన నోట్లను గుర్తించలేదు. దీంతో కొత్తగా వచ్చిన రూ.2వేల నోట్లు ఉన్నా.. వాటిని ఏటీఎంలలో నింపలేని పరిస్థితి. దీంతో.. మిగిలిన రూ.100 నోట్లను ఏటీఎంలలో నింపి ప్రజల అవసరాల్ని తీర్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎదురైన ప్రాక్టికల్ సమస్య ఏమిటంటే.. ఒక్కో ఏటీఎం మెషిన్లో రూ.వంద నోట్లను రూ.20 లక్షల మేర మాత్రమే నింపగలుగుతారు. నోట్ల పరంగా చూస్తే.. 20వేల నోట్లు మాత్రమే ఒక ఏటీఎంలో ఉంటాయి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సగటు వ్యక్తికి ఒకసారికి రూ.2వేలు మాత్రమే పొందే వీలుంది. అంటే.. ఏటీఎంలో ఒకసారి నింపిన క్యాష్ కేవలం వెయ్యి మందికి మాత్రమే సరిపోతుంది.

ఓపక్క వేలాది మంది ఏటీఎంలకు పోటెత్తుతుంటే.. వందల మంది అవసరాలు తీర్చేలా మాత్రమే ఏటీఎంలు ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన రూ.2వేల నోట్లు ఇప్పుడున్న ఏటీఎంల బాక్సులకు సరిపడేలా ఉండకపోవటం ఒక సమస్య కావటంతో.. అందుకు తగ్గట్లుగా బాక్సులు సిద్ధం చేసుకోవటంతో పాటు.. కొత్తగా వచ్చే రూ.500 నోట్లకు సరిపోయేలా బాక్సులు తయారు చేయించే అంశంపై ఇప్పుడే దృష్టి సారించారు. ఈ మార్పులపై ప్రభుత్వం కానీ ముందుగా ఊహించి.. ముందస్తుగా కానీ ఏర్పాట్లు చేస్తే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ లేకపోవటంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యే పరిస్థితి. పెద్దనోట్ల రద్దుతో చిల్లర నోట్ల కష్టాల విషయంలో కేంద్రం కానీ ముందుచూపుతో వ్యవహరించి ఉంటే.. ఇప్పుడు వెల్లువెత్తుతున్న చాలా సమస్యల్ని ముందే ఎదుర్కొని ఉండేవారన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News