జ‌గ‌న్ పై దాడి.. వెంట‌నే స్పందించిన గ‌వ‌ర్న‌ర్

Update: 2018-10-25 09:12 GMT
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్ట్ లో క‌త్తితో దాడి జ‌రిగిన దుర్మార్గం తెలిసిందే. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంపై రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వెంట‌నే స్పందించారు. స‌మాచారం తెలిసిన వెంట‌నే ఏపీ డీజీపీ ఠాకూర్ కు ఫోన్ చేసిన ఆయ‌న‌.. దాడికి సంబంధించి వెంట‌నే త‌న‌కు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించిన‌ట్లు చెబుతున్నారు.

జ‌గ‌న్ పై దాడి అంశంపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు మ‌ల్లాది విష్ణు.. వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌.. జోగి ర‌మేష్‌.. యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావులు మంగ‌ళ‌గిరిలోని డీజీపీ కార్యాల‌యానికి బ‌య‌లుదేరారు. ఇదిలా ఉండ‌గా.. జ‌గ‌న్ పై దాడిని ఏపీ ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది.

ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావ‌ని మంత్రి జ‌వ‌హ‌ర్ అన్నారు.కేంద్ర బ‌ల‌గాల అధీనంలో ఉండే ఎయిర్ పోర్ట్ లో దాడి ఎలా జ‌రిగింది? అన్న అంశంపై విచార‌ణ జ‌రిపి నిజాలు తేల్చాల‌న్నారు. ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లే ముందు పెన్ను కూడా చెక్ చేస్తార‌ని.. అలాంటిది క‌త్తితో లోప‌ల‌కు ఎలా వెళ్లార‌న్న‌ది తేల్చాల‌న్నారు.

మ‌రోవైపు క‌త్తితో దాడి చేసిన శ్రీ‌నివాస్ ది అమ‌లాపురం వాసిగా గుర్తించిన‌ట్లు చెబుతున్నారు. జ‌గ‌న్ పై ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కోళ్ల పందాల‌కు వాడేక‌త్తి ప‌దును తీవ్రంగా ఉంటుంద‌ని.. కుట్ర‌పూరితంగా ఈ దాడి జ‌రిగింద‌న్న అనుమానం క‌లుగుతున్న‌ట్లు బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ పై దాడిని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే న్యాయ‌విచార‌ణ జ‌రిపించాల‌న్నారు. ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన దాడిపై కేంద్ర విమాన‌యాన మంత్రి సురేశ్ ప్ర‌భు తీవ్రంగా ఖండించారు. సీఐఎస్ఎఫ్ సహా అన్ని సంస్థలను ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ట్విట్టర్‌లో ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ మొదలుపెట్టామని.. దీనికి బాధ్యులెవరో గుర్తించాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శిని ఆదేశించామని చెప్పారు.


Tags:    

Similar News