మునుగోడు గ్రామాల్లో బ్యానర్లతో అటాక్.. అభ్యర్థులకు భారీ షాక్

Update: 2022-10-13 05:32 GMT
మునుగోడు ఓటర్లు అంతా కోరుతున్నది ఒక్కటే.. మీరిచ్చే డబ్బులు, తాయిలాలు వద్దు.. మా గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీలు, మౌళిక వసతులు కల్పించండి.. అలా అయితేనే ఓట్లకు రండి లేకుంటే రావద్దు అని గ్రామాల ముందర భారీ బ్యానర్లు కట్టి మరీ రాజకీయ పార్టీల నేతలకు షాకిస్తున్నారు గ్రామాల ప్రజలు.. అధికార టీఆర్ఎస్ మంత్రిని నిలదీశారు. ఎమ్మెల్యేగా చేరి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఇన్నాళ్లు ఏం చేశావంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం అంతిమంగా బీజేపీకి, టీఆర్ఎస్ కు మైనస్ గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇక్కడ అధికారంలో ఉండడమే ప్రజలకు శాపంగా మారింది.

పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక చుక్కలు చూపిస్తోంది. ప్రజలు మరీ తెలివిమీరిపోయారు. గ్రామాల్లో బ్యానర్లతో అభ్యర్థులకు షాక్ ల మీద షాక్ ఇస్తున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని పార్టీ నేతల తీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను తెరమీదకి తీసుకువచ్చి వాటిని పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఓటర్లలో పెరిగిన చైతన్యానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నేతలకు ఇబ్బందికరంగా మారాయి.

తాజాగా మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అధికార టీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ ఊరికి రోడ్డు వేస్తామని చెప్తే ఓటరు గట్టిగా నిలదీసిన పరిస్థితి. మీ మాటలు నమ్మేది లేదంటూ ప్రశ్నించారు. నువ్వు బీజేపీనా.? కాంగ్రెస్ నా అంటే నేను 'ఓటరు' అని సమాధానం ఇచ్చిన పరిస్థితి.

మునుగోడులో ఏదో మాయ చేసి గ్రామాల ప్రజల ఓట్లు వేయించుకుందామని చూస్తున్న వారికి డబ్బులకు ఓట్లు కొందమాని చూస్తున్న వారికి షాకిచ్చేలా ప్రజలు నిలదీతలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఓట్లు కొనుగోలు చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్లు.

ఇక గతంలోనే మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలోని పడమటిపాలెం గ్రామానికి చెందిన ఓటర్లు తమ గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతూ పొలిమేరలో బ్యానర్లు కట్టారు. వేయని వారు రావద్దని స్పష్టం చేశారు. దీంతో ఇక్కడికి ప్రచారానికి రావడానికి రాజకీయ పార్టీల నేతల నానా తిప్పలు పడుతున్నారు.

ఇక తాజాగా గట్టుపల్ మండలంలోని తేరట్ పల్లి గ్రామం బ్యాంకు కాలనీలో తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు గమనిక అంటూ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఎవరూ తమ కాలనీలోకి అడుగుపెట్టవద్దని.. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే వచ్చి ఓట్లు అడగాలని స్పష్టం చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించే వారికే ఓట్లు వేస్తామని.. వారే ఓట్లు అడగడానికి అర్హులు అంటూ బ్యానర్ లో పేర్కొన్నారు.

దీంతో ప్రజాప్రతినిధులు మునుగోడులో ప్రచారానికి వెళదామంటేనే ప్యాంట్లు తడిసిపోతున్న పరిస్థితి. ఇక్కడ ఓటర్లు డబ్బు, పరపతి ఇతర వాటికి అమ్ముడుపోరని.. వారి సమస్యలపై ఐక్యంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ పరిణామం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు ఇబ్బందికరంగా మారింది. ఇది ఎవరికి అనుకూలంగా మారుతుంది? ఎవరి కొంప ముంచుతోందన్న భయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బీజేపీ తరుఫున పోటీచేస్తున్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పనులు చేయకపోవడంతో ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News