సీఎం కొంప ముంచుతున్న ‘‘గడియారం’’

Update: 2016-02-15 09:43 GMT
కీలక స్థానాల్లో ఉన్న వారు అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ.. ఈ విషయాన్ని తరచూ మర్చిపోయి.. విమర్శనాస్త్రాలకు చిక్కుకొని విలవిలలాడిపోవటమేకాదు.. కొన్నిసార్లు పదవులు కోల్పోయే పరిస్థితి తెచ్చుకునే దుస్థితి. పదవి కోల్పోకున్నా.. అంతకంటే ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెట్టుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ మధ్య ఆయనకు ఒక ఆఫ్తుడు ఖరీదైన గడియారాన్ని కానుకగా ఇచ్చారు.

అదెంత ఖరీదన్న విషయం సిద్ధరామయ్యకు తెలుసో లేదో కానీ.. ముచ్చటగా ఉన్న ఆ గడియారాన్ని తీసుకొని చేతికి పెట్టేసుకున్నారు. ఆ వాచ్ ను చూసిన విపక్ష నేత.. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వెంటనే స్పందించి.. రూ.70లక్షలు విలువ చేసే వాచీ.. రూ.1.5లక్షలు విలువ చేసే కళ్లజోడును ముఖ్యమంత్రి ధరించటం పారదర్శకమా? ఇదే సాధారణ జీవితమా అంటూ పేర్కొనటం వివాదంగా మారింది. వాచీ ధరను స్పష్టంగా చెప్పని ముఖ్యమంత్రి.. ఆ వాచీ తనకు ఒక అభిమాని ఇచ్చారని అంగీకరించారు. వజ్రాలు పొదిగిన హ్యూబ్లెట్ వాచీ ధర మార్కెట్లో రూ.70 లక్షలకు పైనే పలుకుతోంది.

ఈ వివాదం రోజురోజుకీ ముదరటం.. ఈ ఇష్యూలో సీఎం పీకల్లోతు విమర్శల్లో చిక్కుకుపోవటంతో దీని నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధరామయ్య ప్రయత్నాలు షురూ చేశారు. న్యాయనిపుణులతో మాట్లాడుతున్న ఆయన వాచీని వేలం వేయటం కానీ.. ప్రజాసొమ్ముగా ప్రకటించటమో చేయాలని.. మొత్తంగా వాచీని వదిలించుకోవటానికి రెడీ అవుతున్నారు.

సిద్ధరామయ్య ప్రయత్నాల్ని గుర్తించిన కుమారస్వామి.. వాచీ అమ్మగా వచ్చే మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు మాత్రం ఇవ్వొద్దంటూ వ్యాఖ్యానించారు. కుమారస్వామి వేసే పంచ్ లతో సిద్ధరామయ్య కిందా మీదా పడుతున్న పరిస్థితి. ఖరీదైన బహుమతులు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించకపోతే ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి.
Tags:    

Similar News