అవును.. ఆమె డ్రైవర్ దేశాధ్యక్షుడయ్యారు

Update: 2016-03-16 04:15 GMT
చెప్పేందుకే నీతులు ఉంటాయి. మాటలకు.. ఆచరణకు మధ్య సైద్దాంతిక వైరుధ్యం ఎంతలా ఉంటుందో ఆంగ్ శాన్ సూచీని చూస్తున్న వాళ్లందరికి అర్థమవుతోంది. ప్రజాస్వామ్యం కోసం ఆమె చేసిన త్యాగాలు ఎవరూ కాదనలేకపోయినా.. తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా.. ఆమె కోరుకున్నట్లు మయన్మార్ కొత్త దేశాధ్యక్షుడిగా ఆమె ఒకప్పటి డ్రైవర్.. అత్యంత విశ్వాసపాత్రుడైన తిన్ క్యా మయన్మార్ దేశాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు.

ఆ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం.. ఆంగ్ శాన్ సూచీకి దేశాధ్యక్షురాలు అయ్యే అవకాశం లేదు. అయితే.. ఆమె నేతృత్వం వహించే పార్టీకి మెజార్టీని ఆ దేశ ప్రజలు మెజార్టీ కట్టబెట్టిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చింది. తాజాగా తనకెంతో విశ్వాసపాత్రుడైన మాజీ డ్రైవర్ ను దేశాధ్యక్షుడిగా మార్చిన ఆమె.. తెర వెనుక నుంచి సూపర్ బాస్ లా వ్యవహరించనున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సూచీ మాజీ డ్రైవర్ తిన్ క్యా ఈ నెల 30న దేశాధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మంగళవారం జరిగిన ఎన్నికల్లో 652 మంది చట్టసభ సభ్యులు పాల్గొనగా360 ఓట్లు దక్కించుకున్న తిన్ క్యా.. దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే అర్హత పొందారు.  1962లో మయన్మార్ దేశాన్ని సైన్యం తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ప్రజలు ఎన్నుకున్న నేత దేశాధ్యక్ష పదవిని చేపట్టటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. దేశంలో అత్యున్నత పదవుల్ని చేపట్టేందుకు రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు కానీ.. మరికొన్ని కారణాల వల్ల కానీ పదవుల్ని చేపట్టని సోనియాగాంధీ.. జయలలిత లాంటి వాళ్లు ఏ తీరులో వ్యవహరించారో ఉద్యమ నాయకురాలిగా  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంగ్ శాన్ సూచీ కూడా సాదాసీదా నిర్ణయం తీసుకోవటం కాస్త మింగుడు పడని వ్యవహారంగా చెప్పక తప్పదు. సూచీకి అత్యంత విశ్వాసపాత్రుడు మాజీ డ్రైవర్ తప్పించి.. తన పార్టీకి చెందిన మరే నేత లేరా..? అదేనా ఆమె సారథ్య సత్తా..?
Tags:    

Similar News