ఆసీస్ కోచ్ ప‌దవికి లీమ‌న్ రాజీనామా!

Update: 2018-03-29 17:15 GMT
బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్న‌ర్ ల పై ఏడాది నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ట్యాంప‌రింగ్ కు పాల్ప‌డ్డ బ్యాన్ క్రాఫ్ట్ పై 9 నెల‌ల నిషేధం విధించారు. అయితే, ఆ మొత్తం వ్య‌వ‌హారంలో కోచ్ డారెన్ లీమ‌న్ పాత్ర పై కూడా క్రికెట్ ఆస్ట్రేలియా విచార‌ణ జ‌రిపింది. కానీ, అందులో లీమ‌న్ పాత్ర ఏమీ లేద‌ని తేల‌డంతో అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోలేదు. అయితే, ఇంత జ‌రుగుతున్నప్ప‌టికీ కోచ్ కు ఏమీ తెలీద‌న‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ తో స‌హా ప‌లువురు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ నిజంగా లీమ‌న్ కు ఏమీ తెలియ‌దంటే....జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌పై అత‌డికి ప‌ట్టులేద‌ని క్లార్క్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ నేప‌థ్యంలో లీమ‌న్ త‌న కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్న‌ట్లు సంచలన ప్రకటన చేశారు.

ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌బోతోన్న నాలుగో టెస్టు అనంత‌రం తాను ఆస్ట్రేలియా క్రికెట్ టీం కోచ్ పదవికి రాజీనామా చేయ‌బోతున్నట్లు లీమ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆసీస్ జట్టుకు కొత్త కోచ్ అవసరమ‌ని, అందుకే తాను కోచ్ గా త‌ప్పుకుంటున్నాన‌ని లీమ‌న్ అన్నారు. ఆటగాళ్లకు వీడ్కోలు చెప్ప‌డం త‌న జీవితంలోకెల్లా కష్టమైన పని అని, కానీ తప్పడం లేదని లీమ‌న్ అన్నారు. తన జీవితంలో ఫిలిప్ హ్యూస్ మరణం ఎప్పటికీ మర్చిపోలేదని, ‘‘మనం క్రికెట్ ఆడుతున్నాం’’ అని హ్యూస్ అన్న‌ మాటలు తన మదిలో ప‌దిలంగా ఉంటాయని తెలిపారు. ఆసీస్ జ‌ట్టుకు గొప్ప ఆట‌గాడిగానే కాకుండా కోచ్ గా కూడా సేవ‌లందించిన లీమ‌న్ వైదొల‌గ‌డం ఆ జ‌ట్టుకు పెద్ద దెబ్బేన‌ని క్రీడావిశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, లీమ‌న్ త‌ర్వాత కోచ్ గా సీఏ ఎవ‌రిని ఎన్నుకుంటుందో అన్న అంశం ఆసక్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News