కరోనా బారిన ఆస్ట్రేలియా కీలక బౌలర్‌!

Update: 2022-10-25 10:21 GMT
ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలయ్యింది.. ఆసీస్‌. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 25 సాయంత్రం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ ఆస్ట్రేలియాకు అత్యంత కీలకం. ఎందుకంటే ఆస్ట్రేలియా ఉన్న గ్రూప్‌లో ఉన్న ఐర్లాండ్, ఆప్ఘనిస్తాన్‌ల రన్‌రేట్‌ ఆసీస్‌ కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఆసీస్‌ గ్రూప్‌–ఏలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ ఆడమ్‌ జంపా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. ఆడమ్‌ జంపాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా వర్గాలు పేర్కొన్నాయి.

తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబుతో ఆడమ్‌ జంపా బాధపడుతున్నట్లు సమాచారం. ఆడమ్‌ జంపాకు రాపిడ్‌ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించామని క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది.

అయితే కోవిడ్‌ బారిన పడిన ప్లేయర్లు కూడా మ్యాచ్‌ ఆడటానికి  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అనుమతి ఇచ్చింది. ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జార్జ్‌ డోక్రెల్‌ కోవిడ్‌ లక్షణాలతోనే శ్రీలంకపై మ్యాచ్‌ ఆడాడు.

పెర్త్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా ఆసీస్‌ నెగ్గాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బ్యాట్సమన్స్‌... వనిందు హసరంగా, మహీశ్‌ తీక్షణ, ధనంజయ డిసిల్వా వంటి శ్రీలంక బౌలర్లను ఎదుర్కొని నిలవాలి.

ఆస్ట్రేలియా జట్టులోనూ మిచెల్‌ స్టార్క్, పాట్‌ కమిన్స్, జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలర్లు ఉన్నప్పటికీ న్యూజిలాండ్‌పై గెలవలేకపోయింది. శ్రీలంకపై మ్యాచ్‌ గెలిచి తీరాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్‌ బౌలర్‌ ఆడమ్‌ జంపా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో ఆసీస్‌ పరిస్థితి మూలిగే నక్కపై తాడికాయ పడ్డట్టు అయ్యింది.

అయితే ఆడమ్‌ జంపాలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకపై మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడా, లేదా అనేది మరికాసేపట్లో తేలిపోనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News