కొవాగ్జిన్కు ఆస్ట్రేలియా అధికారిక గుర్తింపు ..ఆంక్షల్లో మార్పులు !

Update: 2021-11-02 00:30 GMT
భారతదేశానికి  చెందిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ అయిన కొవాగ్జిన్ ను ఆస్ట్రేలియా అధికారికంగా గుర్తించింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇకపై తమ దేశానికి నిరభ్యంతరంగా రావొచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడిస్తూ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్టు ప్రకటించింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, చైనా తయారీ బీబీఐబీపీ కరోనా వ్యాక్సిన్ లకు ప్రయాణపరమైన గుర్తింపు ఇస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

కొవాగ్జిన్ తీసుకున్న 12 ఏళ్లు, అంతకు పైబడిన వయసు కలవారు, బీబీఐబీపీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 18 నుంచి 60 ఏళ్ల వయసున్న ప్రయాణికులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్రకటన నేపథ్యంలో భారత్, చైనా, ఇతర దేశాలకు చెందిన ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు పొందినవారిగా పరిగణనలోకి వస్తారని వివరించింది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఉంది. అయితే 18 నెలల తర్వాత ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆస్ట్రేలియన్లు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు వీలు కల్పించారు. అంతేకాదు, దేశంలోకి అడుగుపెట్టగానే క్వారంటైన్ లో ఉండాల్సిన నిబంధన కూడా తీసేశారు.

ఇక,  కొవాగ్జిన్‌ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు  చేస్తున్న సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను అత్యవసర జాబితాలో చేర్చాలని భారత్ బయోటెక్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసుకన్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్  కోసం ఈవోఐ(ఎక్ప్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్) సమర్పించింది. ఈ క్రమంలోనే జూలై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టుగా డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు అవసరమైన సమాచారాన్ని డబ్యుహెచ్ ఓ కు ఇప్పటికే సమర్పించామని భారత్ బయోటెక్ వర్గాలు వెల్లడించాయి. అయితే  కొవాగ్జిన్ కు సంబంధించి అదనపు సమాచారం కావాలని డబ్ల్యూహెచ్ఓకు చెందిన సాంకేతిక సలహా సంఘం మంగళవారం భారత్ బయోటెక్‌ను కోరింది. కొవాగ్జిన్ కు అనుమతుల జారీ ప్రక్రియ తుది అంకంలో ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ వర్గాలు పేర్కొన్నాయి.
Tags:    

Similar News