50 ఓవ‌ర్ల‌కు ఎంత స్కోరో తెలుసా?

Update: 2018-06-20 05:11 GMT
క్రికెట్‌కు పుట్టినిల్లుగా చెప్పే ఇంగ్లండ్ జ‌ట్టు ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉండ‌టంపై భారీగా జోకులు పేలేవి. మూడేళ్ల క్రితం ఆ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో గ్రూప్ ద‌శ‌ను సైతం దాట‌క‌పోవ‌టం చూసిన‌ప్పుడు.. క్రికెట్‌కు పుట్టినిల్లు మ‌రీ ఇంత దారుణంగా మారిందేన‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మైంది. ఇదిలా ఉంటే గ‌డిచిన కొంత‌కాలంగా ఇంగ్లండ్ జ‌ట్టులో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ జ‌ట్టు ఆట తీరు అనూహ్యంగా మెరుగు ప‌డింది.

చూస్తున్నంత‌నే ప‌రిమిత ఓవ‌ర్ల క్రిక‌ట్లో ప్ర‌మాద‌క‌ర జ‌ట్టుగా మారింది. తాజాగా.. త‌న స‌త్తాను చాట‌ట‌మే కాదు.. క్రికెట్ జ‌ట్ల‌కు షాకిచ్చేలా ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించారు ఇంగ్లండ్ క్రికెట‌ర్లు. 50 ఓవ‌ర్ల వ‌న్డే మ్యాచ్ లో ఒక జ‌ట్టు ఎంత స్కోర్ చేయ‌గ‌లదంటే 400 అని చెప్పేస్తారు. కానీ.. 500 మార్క్ కు ద‌గ్గ‌ర‌గా స్కోర్ ను ఊహించ‌లేరు. అందునా.. బ‌ల‌మైన జ‌ట్టు మీద‌.

కానీ.. అలాంటిదేమీ లేద‌ని.. త‌మ విధ్వంస‌క‌ర బ్యాటింగ్ తో ఎలాంటి బంతుల‌నైనా ఊచ‌కోత కోయ‌ట‌మేన‌న్న విష‌యాన్ని త‌మ ఆట‌తో చూపించారు ఇంగ్లండ్ క్రికెట‌ర్లు. ఐదు వ‌న్డే సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియాల మ‌ధ్య మ్యాచులు జ‌రుగుతున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం మూడో వ‌న్డే జ‌రిగింది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి రాత్రి త‌ర్వాత ఈ మ్యాచ్ ముగిసింది.

నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఇంగ్లండ్ జ‌ట్టు మూడు వికెట్ల న‌ష్టానికి 481 ప‌రుగుల భారీ స్కోర్ ను న‌మోదు చేసి ప్ర‌పంచ రికార్డును సృష్టించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. 2016లో మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జ‌ట్టే పాక్ పై జ‌రిగిన మ్యాచ్ లో 50 ఓవ‌ర్ల‌కు 3 వికెట్ల న‌ష్టానికి 444 ప‌రుగుల అత్య‌ధిక స్కోర్ ను సాధించింది. తాజాగా.. అదే జ‌ట్టు మ‌ళ్లీ చెల‌రేగిపోయి.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ‌న్డే స్కోర్ ను న‌మోదు చేసి కొత్త రికార్డును సృష్టించింది.

ఇంత భారీ స్కోర్ కు ఓపెన‌ర్ గా వ‌చ్చిన జానీ బెయిర్ స్టో (92 బంతుల్లో 139 ప‌రుగులు) బ‌ల‌మైన పునాది వ‌స్తే.. మూడో స్థానంలో వ‌చ్చిన అలెక్స్ హేల్స్ (92 బంతుల్లో ఏకంగా 147 ప‌రుగులు) భారీ స్కోర్ కు జ‌ట్టును చేర్చ‌టంలో కీల‌క‌భూమిక పోషించాడు. మ‌రో ఓపెన్ జేస‌న్ రాయ్ (61 బంతుల్లో 82 ప‌రుగులు) సైతం చెల‌రేగిపోవ‌టంతో రికార్డు స్కోర్ సాధ్య‌మైంది. ఒక‌ద‌శ‌లో ఇంగ్లండ్‌జ‌ట్టు 500 స్కోర్ ను ట‌చ్ చేస్తుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే.. చివ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లో 31 ప‌రుగులు సాధించ‌టంతో 500 మార్క్ ను చేరుకోలేక‌పోయింది. 48 ఓవ‌ర్లో వ‌రుస బంతుల్లో హేల్స్‌.. మోర్గాన్ లు భారీ షాట్ల‌కు ప్ర‌య‌త్నించి ఔట్ కావ‌టంతో ప‌రుగుల వ‌ర‌ద‌కు అడ్డుక‌ట్ట ప‌డింది. లేకుంటే.. క‌ల‌లో కూడా ఊహించ‌లేని స్కోర్ న‌మోదై ఉండేద‌ని చెబుతున్నారు. తొలి రెండు వ‌న్డేల్లో నెగ్గిన ఇంగ్లండ్ జ‌ట్టు.. తాజాగా మూడో వ‌న్డేలోనే ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.
Tags:    

Similar News