వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు షాక్ః బోర్డుకు నో చెప్పిన ఆసీస్ స్టార్ క్రికెట‌ర్లు..!

Update: 2021-06-18 09:30 GMT
ఈ ఏడాది చివ‌ర్లో టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌తీ జ‌ట్టు ల‌క్ష్యం ఐసీసీ ట్రోఫీని గెల‌వ‌డ‌మే. ఇందుకోసం సంవ‌త్స‌రాల ముందు నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటారు. జ‌ట్ల ఎంపిక మొద‌లు.. విదేశీ టూర్లు ప్లాన్ చేయ‌డం వ‌ర‌కు అన్నింటిలోనూ వ్యూహాలు ఉంటాయి. ఇంత‌టి ముఖ్య‌మైన టోర్నీ ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు షాకిచ్చారు ఆ జ‌ట్టులోని కీల‌క‌ ఆట‌గాళ్లు.

త్వ‌రలో ఆసీస్ జ‌ట్టు వెస్టిండీస్‌, బంగ్లాదేశ్ లో ప‌ర్య‌టించాల్సి ఉంది. ఈ మేర‌కు షెడ్యూల్ కూడా ఖ‌రారైంది. అయితే.. తాము ఈ టూర్ల‌కు వెళ్ల‌లేమ‌ని, త‌మ‌ను జ‌ట్టుకు ఎంపిక చేయొద్ద‌ని ప‌లువురు ఆట‌గాళ్లు బోర్డును కోర‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు వ్య‌క్తిగ‌త కార‌ణాలు చూపించ‌గా.. మ‌రికొంద‌రు గాయాల‌తో ఇబ్బంది ప‌డుతున్నామ‌ని రిపోర్టులు స‌మ‌ర్పించారు.

వీరిలో.. స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్న‌ర్ తోపాటు గ్లెన్ మాక్స్ వెల్‌, పాట్ క‌మిన్స్‌, మార్క‌స్ స్టాయినీస్ ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ అని చెప్పారు. మిగిలిన వారిలో స్టీవ్ స్మిత్‌, జే రిచ‌ర్డ్ స‌న్‌, కేన్ రిచ‌ర్డ్ స‌న్‌, డేనియ‌ల్ సామ్స్ గాయాల బారిన ప‌డ్డ‌ట్టు చెప్పారు.

వ‌చ్చే అక్టోబ‌రులో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. అంటే.. కేవ‌లం నాలుగు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ గ్యాప్ లో రెండు టూర్ల‌ను క‌వ‌ర్ చేస్తే.. జ‌ట్టుకు మంచి ప్రాక్టీస్ అవుతుంద‌ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావించింది. కానీ.. ఆట‌గాళ్లు ప‌లు కార‌ణాలు చూపి త‌ప్పుకోవ‌డంతో బోర్డును క‌ల‌వ‌ర పెడుతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. 18 మందితో జ‌ట్టును ప్ర‌క‌టించిది క్రికెట్ ఆస్ట్రేలియా. జులై 9 నుంచి 24 తేదీల మ‌ధ్య విండీస్ లో ప‌ర్య‌టించ‌నున్న ఆసీస్ టీమ్‌.. మూడు వ‌న్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది. బంగ్లాదేశ్ తో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడ‌నుంది. అయితే.. డేట్స్ పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.
Tags:    

Similar News