సీసీ కెమెరాను కొట్టేస్తే.. మ‌రో కెమెరా ప‌ట్టేసింది!

Update: 2019-05-03 06:22 GMT
అంద‌రికి ఆటోడ్రైవ‌ర్ అత‌గాడు తెలుసు. అయితే.. అత‌డిలో మ‌రో యాంగిల్ ఉంది. కంటికి క‌నిపించింది యామం చేసే దొంగ కోణం. అసాంఘిక కార్య‌క్ర‌మాలు చేసే దుర్మార్గ కోణం. అత‌గాడు ప‌నుల్ని సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసిన పోలీసులు అత‌నికి ఇప్ప‌టికే వార్నింగ్ ఇచ్చారు.

దీంతో.. తాను చేస్తున్న ఎద‌వ ప‌నుల్ని ప‌ట్టిస్తున్న సీసీ కెమెరా సంగ‌తి చూడాల‌నుకున్నాడు. దాన్ని కాని కొట్టేస్తే.. త‌న‌కు తిరుగులేద‌ని.. త‌న ఆన‌వాళ్లు పోలీసుల‌కు చిక్క‌వ‌ని భావించాడు. అందుకే.. తాజాగా  కెమెరా కింద‌కు ఆటోను తీసుకొచ్చాడు. దానిపైకి ఎక్కి జాగ్ర‌త్త‌గా  కెమెరా కొట్టేశాడు. త‌న‌కిక తిరుగులేద‌ని భావించాడు. అయితే.. ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఇంత‌కీ ఇదెక్క‌డ చోటు చేసుకుంటుందంటే?

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌ముఖులు.. సంప‌న్నులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌రు 52లోని  నంద‌గిరి హిల్స్ ప్రాంతంలో గురుబ్ర‌హ్మ న‌గ‌ర్ లో వ‌న‌ప‌ర్తికి చెందిన శాంతానాయ‌క్ నివ‌సిస్తూ ఉంటాడు. బ‌తుకుదెరువు కోసం న‌గ‌రానికి వ‌చ్చిన అత‌గాడు.. ఆటో న‌డుపుతూ ఉంటాడు. తాను చేసే చెత్త ప‌నుల్ని ప‌ట్టించే సీసీ కెమెరాను కొట్టేస్తే.. త‌నకిక ఎదురులేద‌ని భావించాడు. దీంతో.. సీసీ కెమెరాను కొట్టేసి.. దాన్ని పాత ఇనుప‌ సామాను షాపులో అమ్మేశాడు.

తాను చేసిన ప‌నిని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేద‌నుకున్నా.. అత‌గాడి చోర‌క‌ళ‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా మ‌రో సీసీ కెమెరా కామ్ గా రికార్డు చేసింది. ఇత‌గాడి నేర్ప‌రిత‌నం చూసిన పోలీసులు సైతం అవాక్కుఅయ్యే ప‌రిస్థితి.దీంతో.. శాంతానాయ‌క్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా దొంగ‌త‌నం ఆరోప‌ణ‌ను అత‌డి ముందుంచారు

మ‌నోడు మ‌హా ముదురు క‌దా?  తాను చేసిన ప‌నికి సాక్ష్యం లేద‌నుకొని.. ధీమాగా తాను దొంగ‌త‌నం చేయ‌లేద‌ని వాదించాడు. దీంతో.. అత‌గాడికి షాకిస్తూ..అత‌డి చేతివాటం ఎంత‌న్న విష‌యాన్ని చెప్పే సీసీ కెమెరా ఫుటేజ్ ను చూపించారు. దీంతో..అవాక్కు అయిన అత‌గాడు.. నేరం ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు నేరాల్ని రికార్డు చేసే సీసీ కెమెరాల్ని దొంగ‌త‌నం చేసే వైనం కొత్త అయితే.. అది కాస్తా మ‌రో సీసీ కెమెరా కంట్లో ప‌డ‌టం కొస‌మెరుపుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News