బాబు పార్టీలో లుక‌లుక‌లు లెక్క చెప్పాడు!

Update: 2019-02-15 05:32 GMT
ఏపీ అంటే ప్ర‌ధాని మోడీకి కోప‌మా?  ఇష్టం ఉండ‌దా?  విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఆయ‌న ఎందుకు ముందుకు రాలేదు?  ఎన్నిక‌ల వేళ‌లో ఆయ‌న ఇచ్చిన హామీల్ని నెరేవ‌ర్చేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌లేదు ఎందుకు?  ఇలాంటి ప్ర‌శ్న‌లు చాలామంది మ‌దిలో మెదులుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ప్ర‌శ్న‌ల్లో కొన్నింటికి స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు  అవంతి శ్రీ‌నివాస్‌.

తాజాగా ఏపీ అధికార‌ప‌క్షం నుంచి విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయ‌న.. ఏపీకి మోడీ ఎందుకు నిధులు ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఏపీలో పెరిగిన అవినీతి వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. ఏపీ అధికార ప‌క్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే అవినీతి మీద ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా విచార‌ణ జ‌రిపించిన కొత్త విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

రాష్ట్రమంతా అవినీతి జ‌రుగుతుంద‌న్న విష‌యం తేలింద‌ని అవంతి మీడియాకు వెల్ల‌డించారు. అప్ప‌టి నుంచే తెలుగుదేశం పార్టీ ఏం అడిగినా కేంద్రం స్పందించ‌లేద‌న్నారు. నిధులు ఇచ్చినా అవినీతికి పాల్ప‌డ‌తార‌న్న కార‌ణంతోనే నిధులు ఇవ్వ‌న‌ట్లు ఆరోపించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో నెల‌కొన్న విచ్చ‌ల‌విడి అవినీతి విధానాలే రాష్ట్రానికి నిధులు రాకుండా చేశాయ‌ని విమ‌ర్శించారు.

ప‌ప్పుబెల్లాలు పంచిన‌ట్లుగా ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టిన నేప‌థ్యంలో తాము ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌నే అతి విశ్వాసంలో బాబు ఉన్నార‌ని.. రాష్ట్రంలో దుర్మార్గ‌మైన పాల‌న సాగుతోంద‌న్నారు. ముద్ర‌గ‌డ ఉద్య‌మం చేసే స‌మ‌యంలో రైలు త‌గ‌ల‌బెట్టానికి క‌డ‌ప నుంచి మ‌నుషులు వ‌చ్చిన‌ట్లుగా చెప్పార‌ని.. అంటే కాపుల‌కు రైలు త‌గ‌ల‌బెట్టే స‌త్తా కూడా లేదా? అన్న ప్ర‌శ్న‌ను సంధించిన ఆయ‌న‌.. రంగా హ‌త్య స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో నెల‌కొన్న ప‌రిస్థితిపై ఆరు రోజుల పాటు బీబీసీ వార్త‌లు ఇచ్చింద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

కాపులు ఒక‌రిపై ఆధార‌ప‌డ‌ర‌ని.. వారికి పోరాడే త‌త్త్వం ఉంద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు మంచివాడిలా బాబుకు కనిపిస్తార‌ని.. ఆయ‌న త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తే మాత్రం త‌ట్టుకోలేర‌న్నారు. ఎవ‌రూ ఆయ‌న్ను ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని.. ప్ర‌శ్నిస్తే స‌హించ‌ర‌న్నారు. టీడీపీలో చాలామందికి ఇదే అభిప్రాయం ఉందంటూ బాబు మీద పార్టీలో నెల‌కొన్న అసంతృప్తి గురించి చెప్పుకొచ్చారు.

2014లో లోక్ స‌భ‌కు పోటీ చేసే అభ్య‌ర్థి లేక‌పోవ‌టంతో తాను ఎంపీగా బ‌రిలోకి దిగాన‌ని.. త‌న కార‌ణంగానే మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచార‌న్నారు. హోదా విష‌యంలో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు నిర‌స‌న‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన చందంగా తాము కూడా రాజీనామాలు చేయాల‌ని చంద్ర‌బాబుకు తాను చెప్పాన‌న్నారు. కానీ.. ఆయ‌న అందుకు ఒప్పుకోలేద‌న్నారు. బాబు మీద పార్టీలో నెల‌కొన్న అసంతృప్తి గురించి ఆవంతి చెప్పిన మాట‌లు ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారాయి.
Tags:    

Similar News