లోకేశ్‌..బాబు ఎవ‌రు దిగినా గెలుపు జ‌గ‌న్ పార్టీదేన‌ట‌!

Update: 2019-03-10 05:06 GMT
ఏపీ ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌తో పాటు.. త‌ప్పు మీద త‌ప్పు అన్న‌ట్లుగా బాబు చేస్తున్న త‌ప్పుల‌కు ఆంధ్రా ప్ర‌జ‌ల్లో ఏపీ అధికార‌ప‌క్షం మీద ఆగ్ర‌హం అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ‌గా అవినీతి.. ఇష్టారాజ్య పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేలా ఏపీ ప్ర‌జ‌లు నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు.

కొన్ని స్థానాల్లో ఎవ‌రు బ‌రిలో ఉన్నా గెలుపు జ‌గ‌న్ పార్టీదేన‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడే వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా అలాంటి ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌క‌టించారు మాజీ ఎంపీ అవంతి శ్రీ‌నివాస్. ఈ మ‌ధ్య‌నే టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్ లు భీమిలి బ‌రిలో దిగినా.. గెలుపు మాత్రం జ‌గ‌న్ పార్టీదేన‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌ లోని జ‌గ‌న్ నివాసం వ‌ద్ద మాట్లాడిన ఆయ‌న‌. టీడీపీ అంటే రాజ‌రిక పాల‌న‌గా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. ఈ మాట తాను అన‌టం లేద‌ని.. ఏపీ ప్ర‌జ‌లు అంటున్న‌ట్లు చెప్పారు.

ఐదేళ్లుగా గుర్తుకు రాని ప్ర‌జ‌లు.. చంద్ర‌బాబుకు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చార‌ని ప్ర‌శ్నిస్తూ.. ఎన్నిక‌ల కార‌ణంగానే బాబుకు ప్ర‌జ‌లు గుర్తుకొచ్చార‌న్నారు. తన వైఫ‌ల్యాల్ని క‌ప్పిపుచ్చుకునేందుకు వీలుగా కేంద్రం మీద పోరాట‌మంటూ మాయ మాట‌లు చెబుతున్న‌ట్లుగా మండిప‌డ్డారు. ఏపీ ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ను ఘోరంగా తిట్టార‌ని.. ఇప్పుడు 2019లో కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకొని బీజేపీ నేత‌ల్ని తిడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన ఆవంతి.. ఏపీలో జ‌గ‌న్ పార్టీ గెలుపు ప‌క్కా అని స్ప‌ష్టం చేస్తున్నారు.


Tags:    

Similar News