ప్ర‌ధాని ఫొటో తీసేయించిన టీడీపీ ఎంపీ

Update: 2018-04-01 08:05 GMT
నాలుగేళ్ల బంధానికి తెర‌ప‌డిన నేప‌థ్యంలో ఏపీ టీడీపీ - బీజేపీ నేత‌ల మ‌ధ్య పొరాపొచ్చాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇన్నాళ్లు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇటు దేశాన్ని అటు రాష్ర్టాన్ని మార్చివేసే మ‌హా నాయ‌కులుగా కీర్తించిన ఆయా పార్టీల నేత‌లు ఇప్పుడు వారిని అస‌లు లెక్క చేయ‌డం లేదు. త‌మ పార్టీ విధాన‌మే తాము పాటిస్తామంటూనే..ఎదుటి పార్టీకి చెందిన నాయ‌కుల‌ను టేకిట్ ఈజీగా తీసేస్తున్నారు. ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో టీడీపీ నేత‌ల ఎదురుదాడి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా తాజాగా టీడీపీ ఎంపీ శ్రీ‌నివాస‌రావు త‌న కార్యాల‌యం నుంచి మోడీ - ప‌వ‌న్ ఫొటోల‌ను ఊడ‌బీకించేశారు.

పార్ల‌మెంటు స‌మావేశాల‌కు సెల‌వు నేప‌థ్యంలో ఎంపీ శ్రీ‌నివాస‌రావు అనకాపల్లిలోని జాతీయ రహదారిలో గల తన క్యాంప్ కార్యాలయానికి శుక్ర‌వారం విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ ఆఫీసులో ఉన్న ఫ్లెక్సీని మార్చివేయాల‌ని ఆర్డ‌ర్ వేశారు. ఆ ఫ్లెక్సీలో ఉన్న‌ది ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్న పాత్రుడు -నారా లోకేష్‌ - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ ఫ్లెక్సీల‌ను వెంట‌నే మార్చివేయాల‌ని  ముత్తంశెట్టి ఆర్డ‌ర్ వేశారు. ప్ర‌ధాని మోడీ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటోలు తీసేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయ‌ని పేర్కొంటూ అయితే ఎన్డీఏ కూట‌మి నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చినందున మోడీ ఫొటోలు తీసివేయాల‌న్నారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నందున ఆయన ఫొటోను సైతం ఉంచ‌వ‌ద్ద‌న్నారు. కొత్త ఫ్లెక్సీని వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. అధికార పార్టీ ఎంపీగారి ఆర్డ‌ర్ చూసి ప‌లువురు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. రాజ‌కీయం అంటే ఇంతే ఉంటుంద‌ని, బాగుంటే ఫొటో పెట్టుకుంటాం లేక‌పోతే తీసి ప‌డేస్తామ‌ని ఎంపీగారు చెప్ప‌క‌నే చెప్పార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌ధాని అయితే ఫొటో పెట్టుకోవాలా అనే కొత్త సందేశాన్ని కూడా ఎంపీగారు ఇచ్చేశార‌ని చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News