ఉత్తరాదిన పుంజుకోనున్న వైసీపీ..!

Update: 2019-02-15 04:38 GMT
ఏపీ రాజకీయం వలసల చుట్టూ తిరుగుతోంది. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొందరు నేతలు పార్టీలు మారే పనిలో ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నవారుండగా.. ఇప్పుడు టీడీపీ నుంచి కీలక నేతలు వైసీపీలోకి జారుతున్నాడు. దీంతో టీడీపీ హై కమాండ్‌ లో ఆందోళన నెలకొంది. ఓ వైపు బాబు అసంతృప్త నాయకులను బుజ్జగిస్తున్నా కొందరు నాయకులు వైసీపీ లోకి జంప్‌ కొడుతున్నారు. వెళ్తు వెళ్తూ  టీడీపీ అధినేతపై ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా టీడీపీకి పట్టున్న ఉత్తరాంధ్ర నుంచి నాయకులు వలస బాట పట్టారు. అనకాపల్లి  నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందిన ఆవంతి శ్రీనివాస్‌ ఇటీవల వైసీపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయారంగేట్రం చేసిన ఆవంతి ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో భీమిలీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ లో చేరారు. 2014లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం మళ్లీ భీమిలి నుంచి పోటీ చేయాలనే వైసీపీలోకి చేరారు.

భీమిలీ కేంద్రంగా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది మంత్రి గంటా శ్రీనివాస్‌. ఆయన అనుచర వర్గంలోనే అవంతి శ్రీనివాస్‌ ఉన్నారు. అయితే గంటా అనుచరవర్గంలో ఉంటే తమ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని భావించి వైసీపీలోకి చేరినట్లు అవంతి వర్గీయులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు అవంతి శ్రీనివాస్‌ మంత్రి గంటా శ్రీనివాస్‌ తో పోటీపడే అవకాశం ఏర్పడింది.

వైసీపీకి ఉత్తరాన కొన్ని స్థానాల్లో పట్టున్నా.. విశాఖలో మాత్రం బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో ఈ జిల్లాలో సరైన నాయకుడి కోసం ఇన్నిరోజులు వేచి చూసింది. ఇప్పుడు అవంతి శ్రీనివాస్‌ చేరడంతో దాదాపు ఈ ప్రాంతం మొత్తం ప్రభావం చూపవచ్చని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అయితే భీమిలీ కేంద్రంగా అవంతి శ్రీనివాస్‌ విశాఖ జిల్లాను ప్రభావితం చేయగలడని భావిస్తున్నారు.

ఇక భీమిలి నియోజకవర్గంలో కాపు ఓట్లు ఎక్కువ. అవంతి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. అటు గత ఎన్నికల్లో మంత్రి గంటా శ్రీనివాస్‌ కాపు ఓట్లతోనే గెలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్‌  చేరికతో వైసీపీకి కలిసిరానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News