మా కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది..చంపేశాం: అవంతి తండ్రి

Update: 2020-10-01 10:10 GMT
హేమంత్ పరువు హత్య తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పరువు కోసం కన్న కూతురి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. ప్రస్తుతం హేమంత్ పరువు హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు పోలీసులు రెండోరోజు నిందితులను ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి - మేనమామ యుగంధర్ ‌రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆరు రోజుల పాటు వీరిద్దరిని కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలిరోజే విచారణను ముమ్మరం చేశారు. మొదటి రోజు కస్టడీలో లక్ష్మారెడ్డి పలు సంచనల విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.

హేమంత్‌ తో ప్రేమ వ్యవహారం గురించి తెలిశాక అవంతిని ఇంట్లోనే కట్టడి చేశామని లక్ష్మారెడ్డి పోలీసులతో చెప్పాడు. అయినప్పటికీ అవంతి ఇంటి నుంచి పారిపోయి హేమంత్‌ ను ప్రేమ వివాహం చేసుకుందని తెలిపారు. అలాగే , తన బామ్మర్ది యుగేంధర్ రెడ్డితో 15 ఏళ్లుగా తనకు మాటలు లేవని... కానీ అవంతి విషయంలో అతనితో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారని తెలుస్తుంది. తమది ప్రాణం కంటే పరువే ఎక్కువని భావించే కుటుంబమని... తమ కాలనీలో తమదే ఆధిపత్యమని చెప్పాడు. అవంతి ప్రేమ వ్యవహారంతో కాలనీలో తాము తలదించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.అందుకే చంపేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు.  అవంతి ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసుల నుంచి తమకు తెలిసింది అని తెలిపాడు.

ఇకపోతే , అయితే హేమంత్‌ ను కిడ్నాప్ చేసి హత్యచేసిన ప్రాంతాల్లో నిందితులతో పోలీసులు మరోసారి సీన్‌ రీకన్‌ స్ట్రక్షన్‌ చేయనున్నారు. అవంతి పేరిట ఉన్న ఆస్తులను తిరిగి తండ్రికి రాసిచ్చినప్పటికీ ఎందుకు హత్య చేశారనే విషయమై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హేమంత్‌ భార్య అవంతి - ఆయన కుటుంబ సభ్యులు మరోమారు పోలీసులను కోరారు. తనతో పాటు హేమంత్‌ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని సీపీని కోరిందామె. దీనికి స్పందించిన సజ్జనార్‌.. చందానగర్‌ లోని హేమంత్‌ ఇంటిదగ్గర 24గంటల భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే , అటు లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కూడా 24గంటలు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ పరువు హత్య కేసులో ఇప్పటివరకూ  21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు

Tags:    

Similar News