సీబీఐ విచారణకు హాజరైన అవినాష్‌ రెడ్డి.. కీలక అంశాలు తేలేనా?

Update: 2023-04-19 11:27 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని సీబీఐ విచారించనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 19 నుంచి 25 వరకు వరుసగా ఆరో రోజులపాటు సీబీఐ ఆయనను విచారించనుంది.

ఈ నేపథ్యంలో తొలి రోజు బుధవారం అవినాష్‌ రెడ్డి హైదరాబాద్‌ లోని జూబ్లీ హిల్స్‌ లోని తన నివాసం నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలతో అవినాష్‌ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అయితే పోలీసులు అవినాష్‌ రెడ్డిని మినహా ఎవరికీ లోపలికి అనుమతించలేదు. గేటు వద్దే వారి వాహనాలను సైతం నిలిపివేశారు.

మరోవైపు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, మరో నిందితుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డిలను కూడా సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ కూడా సీబీఐ విచారించనుంది. అయితే వైఎస్‌ భాస్కరరెడ్డి బీపీతో అస్వస్థతకు గురి కావడంతో ఆయన విచారణపై సందిగ్ధత నెలకొంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం కుదుటపడ్డాక విచారించాలని సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం.

కాగా.. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డిని ఏప్రిల్‌ 25 వరకు అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని తేల్చిచెప్పింది. విచారణకు ఆయన సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన విచారణను ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. ఈ రికార్డులను కోర్టుకు సమర్పించాలని పేర్కొంది.

కాగా అవినాశ్‌ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై కూడా ఏప్రిల్‌ 25న తీర్పు చెప్పనున్నట్లు వెల్లడించింది. వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ సురేందర్‌ ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఎంపీగా ఉన్న అవినాష్‌ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారని తెలిపింది. పిటిషనర్‌ ను అరెస్ట్‌ చేయకుండా విచారించి దర్యాప్తు ముగించాలని.. ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది చెప్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని నిర్దేశించడానికి ఆయన ఎవరు? అని సీబీఐ నిలదీసింది.

ఇంకా దర్యాప్తు ప్రక్రియను కొనసాగిస్తున్నామని.. ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉందని కోర్టుకు సీబీఐ నివేదించింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడ ఉందో తెలియదని పేర్కొంది. ఏ–2 సునీల్‌ యాదవ్‌ హత్య తర్వాత గొడ్డలిని తీసుకుని అవినాశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లాడని సీబీఐ ఆరోపించింది. అవినాశ్‌ రెడ్డికి వివేకానందరెడ్డితో రాజకీయ శత్రుత్వం ఉందని... హత్య వెనుక అసలు ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని కోర్టుకు నివేదించింది. ఈ దశలో ముందస్తు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది.

Similar News