షాకింగ్: తెలంగాణలో ఏవై.4.2 వేరియంట్... అప్రమత్తం కావాల్సిందే !

Update: 2021-10-28 10:30 GMT
యూకే ని వణికిపోయేలా చేస్తున్న ‘ఏవై.4.2’ రకం కరోనా వైరస్ కేసులు తెలంగాణలోనూ వెలుగులోకి వచ్చాయి. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఈ విషయం బయటపడింది. ఇద్దరిలో ఈ తరహా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇనిషియేటివ్ ఇన్ షేరింగ్ ఆఫ్ ఏవియన్‌ ఇన్‌ ఫ్లుయెంజా (జీఐఎస్‌ ఏఐడీ) వెల్లడించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 26 వేల ‘ఏవై.4.2’ కేసులు GISAIDలో నమోదైనట్టు తాజాగా డబ్యుహెచ్ ఓ ఒక నివేదిక లో వెల్లడించింది. సెప్టెంబర్ లో తెలంగాణ లో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్తనమూనాలను హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ డిఎన్ ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. కాగా వీటిలో రెండు (0.6%) ‘ఏవై.4.2’ రకం కేసులు ఉన్నట్లు తేలింది.

48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల మహిళకు సంబంధించిన ఆ రెండు రక్త నమూనాలు నిమ్స్ నుంచి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వచ్చాయి. ఈమేరకు వివరాలను అక్టోబర్లో జీఐఎస్‌ఏఐడీకి కేంద్రం అందజేసింది. అయితే రాష్ట్రంలో బయటపడిన రెండు ఏవై.4.2 బాధితులు వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇప్పుడు ఎలా ఉన్నారు వారికి పూర్తిగా నయమయిందా ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన చర్యలు ఏమిటి అన్న విషయాలపై స్పష్టత లేదు.

JD-NCDC నివేదిక ప్రకారం. భారతదేశంలో ఇప్పటివరకు 18 ఏవై 4.2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలోనే నమోదైనట్లు వెల్లడించింది. తెలంగాణలో జూన్ నెలలో ఒక AY 4.2 కేసు మాత్రమే నమోదైందని.. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ వెల్లడించింది. మొదట యూకే, రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో విస్తరించిన డెల్టా ఏవై.4.2 వేరియంట్ సాధారణ డెల్టా వెరియెంట్‌తో పోలిస్తే 15 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

వాస్తవానికి ఏవై.4.2 కేసులు కొన్నింటిని జూలైలోనే మనదేశంలో గుర్తించారని,, కానీ పెద్దగా వ్యాప్తి చెందలేదని నిపుణులు అంటున్నారు. అయితే ఏవై. 4.2 కేసులు ఇంకా తెలంగాణలో ఎన్ని ఉండొచ్చనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏమైనా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏమరుపాటు తగదనీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, ఇప్పటికీ కట్టడి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు.
Tags:    

Similar News