చల్లబడిన అయ్యన్న-సీటు ఇవ్వకపోయినా టీడీపీలోనేనట!

Update: 2019-03-11 08:37 GMT
తన తనయుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ కావాలి అనేది.. ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడి కోరిక. ఈ విషయంలో చాలా రోజుల నుంచి చంద్రబాబు వద్ద ఈయన లాబీయింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉన్నఫలంగా కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలోకి రావడం, అనకాపల్లి ఎంపీ టికెట్ ఆయనకే దక్కనుందనే ప్రచారం జరుగుతూ ఉండటంతో అయ్యన్న టెన్షన్ పడుతున్నారు.

ఈ విషయంలో ఆయన ఘాటుగా స్పందించారు కూడా. పార్టీలో దశాబ్దాల తరబడి పని చేస్తున్న వారిని పట్టించుకోకుండా…చంద్రబాబు నాయుడు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారంటూ  అయ్యన్న నిన్న మండిపోయారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాన్ని కూడా అయ్యన్న బహిష్కరించినంత పని చేశారు. ఫోన్ ద్వారా కూడా బాబుకు అందుబాటులో లేనంత పని చేశారు అయ్యన్న పాత్రుడు. తనయుడికి టికెట్ దక్కదనే ఆందోళన ఆయనను అలా టెన్షన్ పెట్టిందట.

మరి ఏం జరిగిందో ఏమో కానీ.. ఇప్పుడు ఈ మంత్రిగారు చల్లబడ్డారట. ఈ మేరకు ఆయన మీడియాకు లీకులు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా తను పూర్తిగా సపోర్ట్ అని - పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకునేందుకే బాబు కష్ట పడుతూ ఉన్నారని..అందుకోసం బాబు ఏ నిర్ణయం తీసుకున్నా తన మద్దతు ఉంటుందని అయ్యన్న పాత్రుడు అంటున్నారట.

తన తనయుడికి ఎంపీ టికెట్ కావాలని తాము అనుకోవడం లేదని, తనయుడికి టీడీపీ టికెట్ దక్కినా, దక్కకపోయినా.. తను తెలుగుదేశం పార్టీని వీడేది ఉండదని కూడా అయ్యన్న అంటున్నారట. అనకాపల్లి ఎంపీ టికెట్ ఎవరికి దక్కినా తమ  మద్దతు ఉంటుందని ప్రకటించారట అయ్యన్న. మంత్రిగారిలో ఇలాంటి మార్పు ఆసక్తిదాయకయమైన విషయమే.

ఒకవైపు కొనతాల అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఇప్పుడు ఆసక్తి చూపడం లేదని - ఆయన నామినేటెడ్ రీతిలో రాజ్యసభ సీటును కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అయ్యన్న ఈ వ్యాఖ్యలు  చేయడం గమనార్హం!


Tags:    

Similar News