ఏపీ మినిష్టర్ నోట వాట్సాప్ డైలాగులు

Update: 2016-12-05 10:09 GMT
పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దోళ్లపై లేకపోవడంతో చాలామంది నీతి వ్యాఖ్యాలు చెప్పడం ప్రారంభిస్తున్నారు. నగదు కోసం నానా తిప్పలు పడుతున్న ప్రజలపై కటువైన వ్యాఖ్యలు చేస్తున్నారు.  తాజాగా ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ప్రజలను కించపరిచేలా మాట్లాడడం వివాదాస్పదమవుతోంది.  విశాఖ జిల్లా చోడవరంలో మాట్లాడిన ఆయన క్యూలైన్లలో నిలబడితే కొంపలేం మునిగిపోవులే అన్నట్లుగా మాట్లాడారు.
    
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని సామాన్యులంతా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రెండు వేల కోసం గంటల తరబడి క్యూలైన్‌లో ఉంటున్నారు. ఇన్ని రోజులైనా పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో ప్రజలు అసహనం వ్యక్తం చేయడాన్ని ఏపీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు తప్పుపడ్డారు. నోట్లు మార్చుకునేందుకు ఆ మాత్రం క్యూలో నిలబడలేరా అని మంత్రి ప్రశ్నించారు. చిరంజీవి సినిమా టికెట్ కోసం నాలుగు గంటలు క్యూలైన్‌ లో నిలబడుతారు గానీ… డబ్బు కోసం మాత్రం నిలబడలేరా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బంగారంపై ఆంక్షలు విధించడాన్ని కూడా సమర్ధించారు. బంగారంపై ఆంక్షలు విధించడం వల్ల సామాన్యులకు వచ్చిన నష్టం ఏమీ ఉండదన్నారు.
    
కాగా.. అయ్యన్నపాత్రుడు నోట వినిపించిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికే వాట్సా్ యాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చినవే. ప్రజలు కొంత త్యాగాలు చేయాలి, ఇబ్బందులు భరించాలి అంటూ ఔత్సాహికులు ఎవరో గతంలోనే ఇలా .. సినిమా హాళ్లు దగ్గర టిక్కెట్ల కోసం ఉంటాం కానీ, దేశం బాగు కోసం ఉండలేమా అంటూ మెసేజిలు రూపొందించి పోస్టు చేశారు. అయితే... ప్రజల ఇబ్బందులు తీర్చాల్సిన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా అలా మాట్లాడడంపై విమర్శలు వస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News