జ‌గ‌న్ ప్ర‌య‌త్నం ఫెయిల‌య్యిందట!

Update: 2016-11-04 15:42 GMT
స‌హ‌జంగానే ఏ పాల‌కులు అయినా కొన్ని ప్రజా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటారు. దానికి కార‌ణాలు ర‌క‌ర‌కాలు ఉంటాయి.ఈ క్ర‌మంలో అధికార పార్టీపై ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు చేయ‌డం సాధార‌ణ‌మే. అయితే రివ‌ర్స్‌ లో ప్ర‌తి ఆందోళ‌న‌కు విప‌క్ష‌మే కార‌ణ‌మ‌ని అధికార పార్టీ విమ‌ర్శిస్తే ఎలా ఉంటుంది?ఎబ్బెట్టుగా ఉంటుంది క‌దా? ఇపుడు అదే ప‌నిని ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీ త‌ర‌ఫున సీనియ‌ర్ మంత్రి అయ్యన్నపాత్రుడు పోషించారు. పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులోని ఎగిసిప‌డుతున్న ప్రజా ఆందోళ‌న‌కు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ కార‌ణ‌మంటూ తేల్చేశారు. అంతేకాకుండా కుల - మత - ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ వైసీపీపై విరుచుకుప‌డ్డారు.

రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాలా అభివృద్ధిలో పథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకు 18 గంటలు కష్టపడుతుండగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన వైసీపీ కుట్రలు - దుప్రచారాలు చేస్తోందని అయ్య‌న్న‌పాత్రుడు మండిప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబు ప్రజారాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కృషిచేస్తుండగా అక్కడి రైతులను రెచ్చగొట్టేందుకు జగన్ కుట్ర పన్నార‌ని  ఆరోపించారు. తన అనుయాయులతో కోర్టుల్లో కేసులు వేయించి, పంటలు కూడా తగులబెట్టారని దుయ్య‌బ‌ట్టారు. మచిలీపట్నం పోర్టు విషయంలో కూడా అడుగడుగునా అడ్డుతగులుతూ పోర్టు నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని అయ్య‌న్న‌పాత్రుడు విమ‌ర్శించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలోనూ జగన్ అడ్డుతగిలార‌ని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం పూర్త‌యితే ఉనికి కోల్పోతామనే భయంతో తన పార్టీ నేతలతో కేసులు వేయించిన చరిత్ర జగన్‌ద‌ని అయ్య‌న్న మండిప‌డ్డారు.  పట్టిసీమపై విద్వేషం వెళ్లగక్కార‌ని, మెగా ఆక్వాఫుడ్ పార్క్ పరిశ్రమ విషయంలోనూ జగన్ ద్వంద్వ వైఖరిని అవలంబించారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అర‌బిందో ఫార్మా పరిశ్రమకు లబ్ది చేకూర్చేందుకు తుందుర్రులో దివీస్ పరిశ్రమకు జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నారని అయ్య‌న్న‌పాత్రుడు విమ‌ర్శించారు.

ఓ వైపు అభివృద్ధి నిరోధకుడిలా వ్యవహరిస్తూనే..అధికార దాహంతో కులాలు - మతాలు - ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైఎస్ జ‌గ‌న్ కుట్రలు పన్నుతున్నార‌ని అయ్య‌న్న‌పాత్రుడు ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా సింగపూర్ - మలేసియాతో పాటు ఇతర దేశాల కంపెనీల అధిపతులకు ఈ-మెయిళ్లు పంపిన చరిత్ర వైసీపీ అధినేతద‌ని అయ్య‌న్న‌పాత్రుడు విరుచుకుప‌డ్డారు.  ప్రతిపక్ష నేత ఎన్ని ఈ-మెయిళ్లు పంపినప్పటికీ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ఆగలేదని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెం.1 స్థానాన్ని సాధించిందని తెలిపారు.  లక్షా 50 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు గ్రౌండ్ అయి వాటిద్వారా 2 లక్షలా 50వేల ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం జరిగిందని అయ్య‌న్న వివ‌రించారు. పదేళ్ల తల్లి-పిల్ల కాంగ్రెస్ పాల‌న‌లో లక్షా 5వేల పరిశ్రమలు విద్యుత్ కోతల వల్ల మూతపడి 11 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అయ్య‌న్న‌పాత్రుడు తెలిపారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News