అన్నెన్ని మాటలు అవసరమా అయ్యన్న..?

Update: 2015-06-25 04:34 GMT
విభజన చట్టంలోని సెక్షన్‌ 8 అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఎవరూ కూడా ప్రజల భావోద్వేగాల కంటే కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

విభజన చట్టంలో పేర్కొన్న సెక్షన్‌ 8ను అమలుకు సంబంధించి ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు మరీ ఇంత పెద్ద మాటలు అవసరమా? అన్న సందేహం కలగక మానదు. సెక్షన్‌ 8ని అమలు చేయించుకోవటం ఏపీ ప్రభుత్వం ముందున్న సవాలు. దాన్ని రాజకీయంగా సాధించుకోవాలే కానీ.. ఊరికే.. నొప్పించే వ్యాఖ్యలు చేయటం ద్వారా కాదన్న విషయాన్ని ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు లాంటి వారు గుర్తిస్తే మంచిది.

విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని.. పదేళ్లు కాకపోతే రాజధాని నిర్మాణం పూర్తి అయ్యేంతవరకూ హైదరాబాద్‌లో ఉంటామని.. దిక్కున్నచోటు చెప్పుకోండంటూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. చట్టంలో ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకోవాలే తప్పించి.. అవతలి పక్షం మనోభావాల్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేయటం అంత మంచిది కాదు.

విభజన జరిగిన తర్వాత.. ఎంత హక్కులున్నా అదంతా కూడా.. విడాకులు తర్వాత భార్యభర్తల మధ్య బంధం లాంటిదేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. సంసారంలో ఎన్ని గొడవలున్నా.. ఎంత కొట్టుకున్నా రాత్రి అయ్యేసరికి ఒకే ఇంట్లో ఉంటారు. కానీ.. ఒకసారి చట్టబద్ధంగా విడాకులు పొందాక.. ఎవరి హక్కులు వారికి ఉంటాయన్న విషయం మర్చిపోకూడదు. ఎవరి హక్కుల్ని ఎవరూ కాలరాయలేరు.

అయితే.. ఇక్కడ అవతల వారి హక్కుల గురించి ప్రశ్నించే కన్నా.. తమ హక్కుల గురించి పోరాడటం మంచిది. అది న్యాయబద్ధంగా ఉంటుంది కూడా. అంతేకానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం అయ్యన్నపాత్రుడు లాంటి వారు ఎప్పుటికి తెలుసుకుంటారు? హక్కుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు.. ఇంతకాలం ఏం చేసినట్లు..? ఎందుకు ఈ విషయంపై మాట్లాడనట్లు..?



Tags:    

Similar News